Katchatheevu Island row: మోదీజీ..పదేళ్లలో మీరు ఎందుకు వెనక్కి తేలేదు?.. ఖర్గే సూటిప్రశ్న
ABN , Publish Date - Mar 31 , 2024 | 09:13 PM
కచ్చాతీపు దీవులను శ్రీలంకకు అప్పగించడం ఇందిరాగాంధీ హయాంలో జరిగిన కీలక తప్పిదం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. కచ్చాతీవు దీవులను పదేళ్ల మీ హయాంలో వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: కచ్చాతీపు దీవులను (Katchatheevu Island row) శ్రీలంకకు అప్పగించడం ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాంలో జరిగిన కీలక తప్పిదం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కచ్చాతీవు దీవులను పదేళ్ల మీ హయాంలో వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. నిరాశానిస్పృహల కారణంగానే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రధాని లేవనెత్తుతున్నారని విమర్శించారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కచ్చాతీవు దీవులను శ్రీలంకకు ఎలా అప్పగించిందనే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, కచ్చాతీవు దీవులను కాంగ్రెస్ పార్టీ ఎలా వదులుకుందో ఇప్పుడు తెలిసిందని, ఈ చర్య ప్రతి భారతీయుడికి కోపం తెప్పిస్తోందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీన పరచడమే 75 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ విధానమని దుయ్యపట్టారు. కచ్చాతీవులను అప్పగించడం ద్వారా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ చేసిన తప్పిదం మత్స్యకారుల పాలిటి శాపంగా మారిందన్నారు.
జైరాం రమేష్ మండిపాటు..
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కౌంటర్ ఇస్తూ, బంగ్లాదేశ్‌తో మోదీ సర్కార్ భూ ఒప్పందం మాటేమిటని నిలదీశారు. ఎన్డీయే హయాంలో చేసిన భూ సరిహద్దు ఒప్పందం వల్ల భారత్ 10,051 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
కాలం చెల్లిన అంశం: స్టాలిన్
కచ్చాతీవులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం మండిపడ్డారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారం దౌర్భాగ్యమే అయినా, అది కాలం చెల్లిన రాజకీయ సమస్య అని పేర్కొన్నారు. దాదాపు 50 ఏళ్ల నాటి సమస్యపై తన ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగా ఓ వార్తా కథనం ద్వారా ప్రధాని మోదీ కళ్లు తెరవడం నిజంగా ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి