Supreme Court: నా అరెస్టు చట్టవిరుద్ధం కౌంటర్ అఫిడవిట్‌లో కేజ్రీవాల్
ABN , Publish Date - Apr 28 , 2024 | 03:00 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో తనను దురుద్దేశంతో ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొన్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ అఫిడవిట్ దాఖలు చేయగా దానికి ఆయన కౌంటర్ దాఖలు చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పుడు తనను అరెస్టు చేసిన తీరు, సమయం ఈడీ నిరంకుశత్వానికి అద్దం పడుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ సాక్షులను బలవంతం చేసిందన్నారు. గోవా ఎన్నికల ప్రచారంలో ‘సౌత్ గ్రూపు’ నుంచి నిధులు అందాయని నిరూపించడానికి ఈడీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ అన్నారు. కాగా, జైలులో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్య బృందం ధ్రువీకరించింది. ఆయనకు ఇస్తున్న మందుల మోతాదు మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది.