కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా..
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:26 AM
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆమె.. పక్కనే పాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా ఉంచారు.
రామాయణంలో భరతుడిలా పాలిస్తా!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆతిశీ వ్యాఖ్యలు
నెలలు భరతుడిలా పాలన!
కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యేదాకా
ఆయన కుర్చీ అలాగే ఉంటుంది
సీఎం ఆఫీసులో రెండో కుర్చీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆమె.. పక్కనే పాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా ఉంచారు. ఆయన వాడిన కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చొని ఆతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో సన్నివేశాన్ని ప్రస్తావించారు. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో భరతుడు రాజ్యాన్ని ఏలాల్సి వచ్చిందన్నారు. అప్పుడాయన రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి బాధ్యతలు నెరవేర్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తనదీ అదే పరిస్థితి అని ఆతిశీ చెప్పారు. భరతుడి స్ఫూర్తితోనే తాను నాలుగు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని, అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్‌దే. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు ఈ కుర్చీ సీఎం కార్యాలయంలోనే ఉంటుంది. కేజ్రీవాల్ పునరాగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది’’ అని ఆతిశీ చెప్పారు. ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ (43).. ఈ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. అలాగే మూడో మహిళ. అంతకు ముందు కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్, బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్‌లు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
ప్రస్తుతం దేశంలో ఆతిశీ రెండో మహిళా ముఖ్యమంత్రి. ఇక ఆతిశీతో పాటు ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో నలుగురు పాతవారు కాగా.. ఒకరు కొత్త ఎమ్మెల్యే. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్‌తో పాటు గోపాల్‌రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా 13 శాఖలను చూసుకున్న ఆతిశీ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వాటిని తన వద్దే ఉంచుకున్నారు.
ఇది రాజ్యాంగాన్ని అగౌరవపర్చడమే: బీజేపీ
ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ తీరును బీజేపీ తీవ్రంగా ఖండించింది. సీఎం ఆఫీసులో ఆమె కుర్చీ పక్కనే కేజ్రీవాల్ కోసం మరో కుర్చీని ఖాళీగా ఉంచడాన్ని తప్పుపట్టింది. ఆతిశీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆరోపించారు. తన వ్యవహారశైలితో ఆమె సీఎం కార్యాలయాన్ని అవమానించారన్నారు. సీఎం ఆఫీసు డెస్కు లో రెండు కుర్చీలు వేయడం ద్వారా రాజ్యాంగాన్ని అగౌరవపర్చారని ఆరోపించారు. సీఎం ఆఫీసు గౌరవానికి భంగం కలిగించడమేగాక ఢిల్లీ ప్రజల మనోభావాలను కూడా కించపరిచేలా వ్యవహరించారంటూ ఆతిశీపై ధ్వజమెత్తారు.