Jharkhand CM Hemanth Soren: జార్ఖండ్‌లో కీలక పరిణామాలు.. భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్న సీఎం హేమంత్ సోరెన్?
ABN , Publish Date - Jan 30 , 2024 | 04:06 PM
జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భూకుంభ కోణం ఆరోపణలకు సంబంధించి మనీల్యాండరింగ్ కోణంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాంచీ: జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భూకుంభ కోణం ఆరోపణలకు సంబంధించి మనీల్యాండరింగ్ కోణంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హేమంత్‌ను ఈడీ అరెస్ట్ చేయవచ్చంటా ఊహాగానాలు వెలువడుతున్న వేళ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని ప్రచారం మొదలైంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకోసమే సోరెన్ సొంత పార్టీ జేఎంఎం, కాంగ్రెస్, మిత్రపక్ష ఎమ్మెల్యేలను లగేజీలు, బ్యాగులు సర్దుకొని రాంచీకి రావాలని సోరెన్ పిలిచారని ఆరోపించారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన ఉందని ‘ఎక్స్’ వేదికగా ఆయన పేర్కొన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన అధికార కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీ చేరుకోవాలని ఆదేశాలు వెళ్లడంతో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. భూకుంభ కోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీంతో జార్ఖండ్ రాజకీయాల్లో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో మాయం.. రాంచీలో ప్రత్యక్షం
ఆదివారం ఢిల్లీలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆ తర్వాత జాడ లేకుండాపోయారు. మనీల్యాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోరెన్ నివాసానికి వెళ్లగా ఆయన కనిపించకుండా పోయారు. ఆయన నివాసంలో లభించిన రూ.36 లక్షల నగదు, సోరెన్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీలోని నివాసాలు, జార్ఖండ్ భవన్‌లో కూడా సోరెన్ ఆచూకీని గుర్తించలేదు. దాదాపు 24 గంటలపాటు సోరెన్ ఆచూకీని ఈడీ అధికారులు పసిగట్టలేకపోయారు. ఢిల్లీలో విమానం ఎక్కాల్సి ఉన్నప్పటికీ ఆయన ఆచూకీని ఈడీ అధికారులు గుర్తించలేదు. దీంతో సోరెన్ పరారయ్యారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం పరారీలో ఉన్నారంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండీ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సోరెన్‌కు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తే రూ.11,000 నగదు బహుమతి అందిస్తామని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. తాము ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నామని జేఎంఎం పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.
మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆసక్తికరంగా స్పందించారు. రాష్ట్రంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని, తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని, సరైన సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించే దిశగా బీజేపీ కుట్రలు చేస్తోందని జేఎంఎం మిత్రపక్షమైన కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆసక్తికర పరిణామాల మధ్య చివరిసారిగా ఆదివారం రాత్రి ఢిల్లీలో కనిపించిన హేమంత్ సోరెన్ మంగళవారం రాంచీలోని తన నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యేల సమావేశానికి తన ఇంటి నుంచే బయలుదేరి వెళ్లారు. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాగా జార్ఖండ్‌లో భూకుంభకోణంలో ఆరోపణలపై హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.