Mallilkarjun Kharge: ఖర్గే నోట మళ్లీ 'పాయిజన్' మాట.. మోదీపై వ్యంగ్యాస్త్రం
ABN , Publish Date - May 25 , 2024 | 09:31 PM
2047 వరకూ తన వ్యూహానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆయన మాటల్లో మరోసారి 'పాయిజన్' ప్రస్తావన వచ్చింది.
కలబురగి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల మాటల దూకుడుకు కళ్లెం వేయాలని బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ లేఖలు రాసినప్పటికీ యథాప్రకారం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. 2047 వరకూ తన వ్యూహానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తాజాగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆయన మాటల్లో మరోసారి 'పాయిజన్' (poison) ప్రస్తావన వచ్చింది.
''మా గంగ తనను పిలిచిందని ఆయన (మోదీ) అంటున్నారు. 2047 వరకూ తన ప్లాన్స్ చెబుతున్నారు. 2047 వరకూ తాను ఆరోగ్యంగా ఉండానని అంటున్నారు. ఆయన కొన్నిసార్లు సముద్రంలో డైవింగ్ చేస్తారు. కొన్ని సార్లు గంగాజలాల్లో మునకలేస్తారు. మరికొన్ని సార్లు గుహల్లోకి వెళ్తారు. ఇంకొన్నిసార్లు ఒంటరిగా ధ్యానం చేస్తారు. బహుశా 'తపస్సు'తో ఆయన ఇదంతా చెబుతున్నారేమో నాకైతే తెలియదు'' అని కలబురగిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే అన్నారు.
Prajwal Revanna case: బెల్జియంలో మీ కుమారుడు చనిపోతే ఏం చేశారు? సీఎంను నిలదీసిన కుమారస్వామి
విషమని చెప్పినా వినకపోతే ఏం చెస్తాం?
మంచి పని చేస్తే మంచి ఫలితమే వస్తుందని ఖర్గే చెబుతూ... ''కడుపు నిండాలంటే పనిచేయాలి. మీరు మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. తప్పుడు పనులు చేస్తే తప్పుడు ఫలితమే వస్తుంది. మంచి చేయాలా, చెడు చేయాలా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. నేను విషాన్ని చూపించి అది ముట్టుకోవద్దని చెబితే.. దానిని రుచి చూసి తీరుతానని పట్టుబడితే ఫలితం ఎలా ఉంటుంది? మోదీ పరిస్థితి అలానే ఉంది'' అని ఖర్గే ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా ఖర్గే దాదాపు ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన ఒక ర్యాలీలో మోదీని ''విష సర్పం''తో ఖర్గే పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడటంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రధానిని నేరుగా ఆమాట అనలేదని, బీజేపీ, ఆ పార్టీ విభజన సిద్ధాంతం గురించే తాను ఆ ప్రస్తావన చేశానన్నారు.
Read National News and Latest News here