Bihar politics: నితీష్‌కు చెక్ ...లాలూ చాణక్య వ్యూహం..?
ABN , Publish Date - Jan 27 , 2024 | 10:00 PM
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నితీష్ కుమార్ రాజీనామాతోనూ, బీజేపీతో చెలిమికట్టి తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతోనూ తెరపడకపోవచ్చని తెలుస్తోంది. తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్న ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్... నితీష్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బలమైన వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.
పాట్నా: బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నితీష్ కుమార్ (Nitish kumar) రాజీనామాతోనూ, బీజేపీతో చెలిమికట్టి తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతోనూ తెరపడకపోవచ్చని తెలుస్తోంది. తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్న ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav).... నితీష్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బలమైన వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. కాకలు తీరిన రాజకీయ నేతగా పేరున్న లాలూ మరోసారి 'చాణక్య' వ్యూహానికి పదునుపెడుతున్నారని చెబుతున్నారు.
ఆర్జేడీ ఎమ్మెల్యే అవథ్ బిహారి చౌహరి బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉండటం లాలూకు కలిసొచ్చే ఒక అంశంగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను తదుపరి సీఎంగా చేసేందుకు లాలూ పావులు కదపవచ్చని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో బలాబలాపరంగా చూసినప్పుడు 243 సీట్ల బిహార్ అసెంబ్లీలో కనీస మెజారిటీకి 122మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎ్‌స)కు నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఒక్కరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసి ఉన్నాయి. ఈ 3 పార్టీల బలం 114. అంటే మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ క్రమంలో మహారాష్ట్ర తరహా వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జేడీయూ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఆర్జేడీ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. తద్వారా అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన సంఖ్యను తగ్గించే వీలుంటుంది. ఆ వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిసి ఆర్జేడీ కోరుతుంది. అయితే ఆర్జేడీని కాదని జేడీయూను గవర్నర్ ఆర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తే మరో విధంగా ముందుకు వెళ్లాలని ఆర్జేడీ ఆలోచనగా ఉందంటున్నారు. ఫిబ్రవరి 5న బడ్జెట్ సమావేశాల్లోనే నితీష్‌ను సవాలు చేస్తూ 'ఫ్లోర్ టెస్ట్'కు వెళ్లాలని ఆర్జేడీ నిర్ణయించినట్టు సమాచారం. ఈలోపు జేడీయూ ఎమ్మెల్యేలకు గాలం వేయడం, కొందరి చేత రాజీనామా చేయించడం ద్వారా తేజస్విని సీఎం చేయాలనే ఆలోచనకు మరింత పదును పెట్టాలని లాలూ వ్యూహంగా చెబుతున్నారు.