JOB Scam: భూమికి బదులు ఉద్యోగం.. మాజీ సీఎంపై ఛార్జిషీటు
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:04 PM
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె మిసా భారతి, హిమా యాదవ్, హృదయానంద్ చౌదరి, అమిత్ కత్యాల్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి.
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ (Land for job scam)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారంనాడు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi), ఆమె కుమార్తె మిసా భారతి, హిమా యాదవ్, హృదయానంద్ చౌదరి, అమిత్ కత్యాల్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా రెండు సంస్థల పేర్లు కూడా ఛార్జిషీటులో చేర్చారు.
కోర్టు ఆదేశాల మేరకు ఛార్జిషీటు ఎలక్ట్రానిక్ కాపా, డాక్యుమెంట్లను మంగళవారంనాడే దాఖలు చేయాల్సి ఉంది. భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారనే ఆరోపణపై మనీ లాండరింగ్ కింద ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కు సన్నిహితుడైన అమిత్ కత్యాల్‌ను ఈడీ గతంలో అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 మంత్రివర్గంలో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం వెలుగుచూసింది. 2004-2009 మధ్య భారత రైల్వే జోన్లలో గ్రూప్-డీ పోస్టులకు గాను లాలూ కుటుంబీకులు, సన్నిహితులు భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని దర్యాప్తు సంస్థల ఆరోపణగా ఉంది.
కాగా, ఈ కుంభకోణంలో గత ఏడాది మార్చిలో ఢిల్లీ ఎన్‌సీఆర్, పాట్నా, ముంబై, రాంచీలోని 24 లొకేషన్లలో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో లెక్కల్లో చూపించని రూ.1 కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల గోల్డ్ బులియన్, 1.5 కేజీల స్వర్ణాభరణాలలతో పాటు పలు ప్రాపర్టీ పేపర్లు, సేల్ డీడ్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. రూ.600 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు ఈడీ చెబుతోంది. గత ఏడాది జూలైలో సీబీఐ సైతం లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్, రబ్రీదేవిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇది రెండో ఛార్జిషీటు. తొలి చార్జిషీటు తర్వాత వెలుగు చూసిన సాక్ష్యాలు ఆధారంగా సీబీఐ రెండో ఛార్జిషీటు దాఖలు చేసింది.