Kerala: కేరళపై నైరుతి ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ABN , Publish Date - Jun 01 , 2024 | 06:02 PM
కేరళ(Kerala) తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకిన రెండ్రోజులకు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ కేరళలో కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
తిరువనంతపురం: కేరళ(Kerala) తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకిన రెండ్రోజులకు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ కేరళలో కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడి కురుస్తున్న వర్షాలకు కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని హై-రేంజ్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
త్రిసూర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కేరళలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(IMD) సెంట్రల్ జిల్లా త్రిసూర్, ఉత్తర జిల్లాలైన మలప్పురం, కోజికోడ్‌లకు శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇడుక్కి, పాలక్కాడ్, వాయనాడ్‌లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, ఆరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రానున్న 24 గంటల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 11 సెం.మీ నుండి 20 సెం.మీ వరకు వర్షం కురుస్తుందని.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఏరియాల్లో 6 సెం.మీ నుంచి11 సెం.మీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.
భయాందోళనలో స్థానికులు..
ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.పంటలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. "ఇంత భయంకర పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు జారీ కిందకు పడ్డాయి. చెట్లు ఎగిరి మాపైకి వస్తున్నట్లు అనిపించింది" అని ఓ గ్రామస్థుడు భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.
కొండ ప్రాంతంలో నివాసముంటున్న ఓ ఇంటిపై రాళ్లు పడ్డాయి. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనంతరం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదకర తొడుపుజా-పులియన్మల రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు.
For Latest News and National News click here