Arvind Kejriwal: అరెస్టయ్యాక అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్.. సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 22 , 2024 | 04:14 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "నేను జైలులో ఉన్న బయట ఉన్న నా జీవితం దేశానికి అంకితం" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో "కీలక కుట్రదారు" అని ఆరోపిస్తూ ఈడీ 10 రోజుల రిమాండ్‌ను కోరింది.
తనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ కేజ్రీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే ఆయన్ని అరెస్టు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌత్ గ్రూపునకు చెందిన కొందరు నిందితుల నుంచి కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేశారని ఈడీ తరఫు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు రౌస్అవెన్యూ కోర్టుకు తెలిపారు. కాగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
ఆప్ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ నిలువరించారు భద్రతా సిబ్బంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అరెస్ట్ చేసింది. వీరితోపాటు మరికొంత మంది నేతలు ఏడాదికిపైగా జైళ్లలో మగ్గుతున్నారు.
2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఈ కేసు చివరి అంకానికి చేరుకుంది. మరి ఈ కేసులో ఈడీ ఏం తేలుస్తుంది? న్యాయస్థానాలు ఏం తీర్పునిస్తాయి? అనేది ముందు ముందు చూడాలి. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు అనేక మంది ప్రముఖలను అరెస్ట్ చేశారు. వారిలో ఢిల్లీకి చెందిన ప్రముఖులతో పాటు.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి