Lok Sabha Election Results: ఎన్నికల ఫలితాలపై ఖర్గే తొలి రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jun 04 , 2024 | 07:52 PM
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిచ్చారని అన్నారు. ''ఇది ఆయన నైతిక, రాజకీయ ఓటమి'' అని అభివర్ణించారు. రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్‌తో కలిసి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల (Lok Sabha Election Results)పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలిసారి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిచ్చారని అన్నారు. ''ఇది ఆయన నైతిక, రాజకీయ ఓటమి'' అని అభివర్ణించారు. రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్‌తో కలిసి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలపై...
'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఖర్గే సమాధానమిస్తూ, భాగస్వామ్య పార్టీలు, తమతో కలిసి వచ్చే కొత్త భాగస్వాములతో ఇంకా మాట్లాడలేదని, వారితో మాట్లాడిన తర్వాత మెజారిటీ ఎలా సాధించడమనేది చూస్తామని చెప్పారు. ''అన్ని వ్యూహాలూ ఇక్కడే చెప్పేస్తే...మోదీజీ చాలా తెలివైనవారు'' అంటూ ఖర్గే చమత్కరించారు.
రాహుల్ క్లారిటీ..
కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై ఖర్గే వాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తూ, భాగస్వామ్య పార్టీలతో బుధవారంనాడు సమావేశమవుతామని, అక్కడే ఈ ప్రశ్నలు లెవనెత్తి, సమాధానాలు రాబడతామని చెప్పారు. భాగస్వామ్య పార్టీలతో సంప్రదించకుండా తాము ఎలాంటి ప్రకటన చేయమని అన్నారు.