Share News

Lok Sabha elections: కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తులు.. గుర్రుమంటున్న సీనియర్ నేతలు

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:43 PM

కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తమ పేరు చోటుచేసుకోకపోవడం, తమను దూరంగా ఉంచడంపై పలువురు బీజేపీ అగ్రనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా, ఆ పార్టీ సీనియర్ నేతలైన సదానంద గౌడ, కేఎస్ ఈశ్వరప్ప, కరాడి సంగన్న తదితరులు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.

Lok Sabha elections: కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తులు.. గుర్రుమంటున్న సీనియర్ నేతలు

బెంగళూరు: కర్ణాటక (Karnataka) నుంచి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తమ పేరు చోటుచేసుకోకపోవడం, తమను దూరంగా ఉంచడంపై పలువురు బీజేపీ (BJP) అగ్రనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా, ఆ పార్టీ సీనియర్ నేతలైన సదానంద గౌడ, కేఎస్ ఈశ్వరప్ప, కరాడి సంగన్న తదితరులు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.


సదానంద గౌడ

కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న సదానంద గౌడ్ బెంగళూరు నార్త్ నుంచి తనకు టిక్కెట్ నిరాకరించడానికి ముందే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన యూ-టర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తనపై ఒత్తిడి వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో చేరే ఆలోచన ఉందన్న సంకేతాలు సైతం ఇచ్చారు. బీజేపీ నేతలే కాదు, కాంగ్రెస్ వాళ్లు కూడా తనను అడుగుతున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బెంగళూరు నార్త్ నుంచి కేంద్ర మంత్రి శోభా కరాండ్లాజేకు బీజేపీ సీటు ఇచ్చింది. సదానంద గౌడకు ఒక్కలిగ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరుంది.


కేఎస్ ఈశ్వరప్ప

హవేరీ నుంచి తన కుమారుడు కేఈ కంటేష్‌కు సీటు ఇవ్వకపోవడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని ఆ సీటులో బీజేపీ నిలబెట్టింది. తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అడ్డుపడినట్టు ఈశ్వరప్ప ఆరోపించారు. యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రపై శివమొగ్గ నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. బీజేపీకి అనుకూలంగా పనిచేయడానికి ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ వ్యవస్థ మాత్రం చాలా చెడ్డగా ఉందని ఈశ్వరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైందని ప్రధాని చెబుతుంటారని, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. కర్ణాటక బీజేపీ కూడా ఒక కుటుంబం అధీనంలో ఉందని, దీనిని తాము నిరసిస్తున్నామని చెప్పారు.


కరాడి సంగన్న

కొప్పల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (2014, 2019) బీజేపీ ఎంపీగా ఉన్న కరాడి సంగన్న తనకు ఈసారి టిక్కెట్ నిరాకరించడంపై ఆగ్రహంతో ఉన్నారు. కొప్పల్ నుంచి డాక్టర్ బసవరాజ్ క్యవటర్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో కరాడి సంగన్న కాంగ్రెస్‌కు దక్కరవుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతానికైతే తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ నేతలతో సమావేశమై పార్టీలో ఉండాలా కాంగ్రెస్‌లో చేరాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సంగన్న తెలిపారు.


జేఎస్ మధుస్వామి

తుంకూరు నియోజకవర్గం నుంచి వి.సోమన్నను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ మంత్రి జేఎస్ మధుస్వామి కూడా అసంతృప్తితో ఉన్నారు. యడియూరప్ప తనకు బాసటగా నిలకపోవడం, తన అభ్యర్థిత్వాన్ని బలపరచకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో తనకు రక్షణ లేనప్పుడు ఇంకా ఇక్కడే కొనసాగాలా వద్దా అనే దానిపై కార్యకర్తలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని మధుస్వామి తెలిపారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో జరుగనున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసింది. 29 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 03:43 PM