Share News

Lok Sabha Polls: ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీ: కేజ్రీవాల్

ABN , Publish Date - Mar 10 , 2024 | 08:40 PM

'ధర్మం' తమ పార్టీతో ఉందని, ప్రజలు ధర్మంతో ఉంటారో అధర్మం వెనుక ఉంటారో తేల్చుకోవాలని 'ఆప్' చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తాను గెలిపించాలని కోరారు.

Lok Sabha Polls: ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీ: కేజ్రీవాల్

కురుక్షేత్ర: 'ధర్మం' తమ పార్టీతో ఉందని, ప్రజలు ధర్మంతో ఉంటారో అధర్మం వెనుక ఉంటారో తేల్చుకోవాలని 'ఆప్' చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. హర్యానా (Haryana)లోని కురుక్షేత్ర (Kurukshetra) లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తాను గెలిపించాలని కోరారు. హర్యానాలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉండగా, రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి 'ఆప్' పోటీ చేస్తోంది.


మహాభారతం ప్రస్తావన

మహాభారతంలో ధర్మం కోసం యుద్ధం జరిగిన పవిత్రమైన భూమి కురుక్షేత్రమని, కౌరవులకు అన్నీ ఉన్నా పాండవులు విజయం సాధించారని చెప్పారు. ''పాండవులకు ఏముంది? కృష్ణ భగవానుడు వారితో ఉన్నారు. ఈరోజు బీజేపీ సారథ్యంలోని కేంద్రానికి అన్నీ ఉన్నాయి. అన్ని అధికారాలు వారి వద్దే ఉన్నాయి. వారికి ఐబీ, సీబీఐ, ఈడీ ఉన్నాయి. మన వైపు ధర్మం మాత్రమే ఉంది. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మీరు ధర్మం వైపు ఉంటారో అధర్మం వైపు ఉంటారో తేల్చుకోవాలి'' అని సభికులను ఉద్దేశించి కేజ్రీవాల్ అన్నారు.


మీ ఓట్లు వారికి అక్కర్లేదట..

లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలుస్తామని బీజేపీ చెప్పుకోవడంపై మాట్లాడుతూ, వారు బహిరంగంగా మీ (ప్రజలు) ఓట్లు అక్కర్లేదని చెబుతున్నారని, నేను మాత్రం ముకుళిత హస్తాలతో ఓట్లు అడిగేందుకు ఢిల్లీ నుంచి వచ్చానని కేజ్రీవాల్ చెప్పారు. సుశీల్ గుప్తా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తారని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల ఓట్లు తమకు అవసరమని, వారికి (బీజేపీ) మాత్రం ప్రజల ఓట్లతో అవసరం లేదని విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారని, ఒకరు దేశ భక్తులని, మరొకరు అంధ భక్తులని ఆయన నిర్వచించారు. దేశభక్తి కలవారంతా తనతో కలిసి రావాలని, తమకు అంధ భక్తి అవసరం లేదని స్పష్టం చేశారు.

Updated Date - Mar 10 , 2024 | 08:40 PM