Lok Sabha polls: సీట్ల సంఖ్య కంటే గెలిచే స్థానాలపైనే కాంగ్రెస్ దృష్టి.. ఆశిస్తున్న స్థానాలివే..
ABN , Publish Date - Jan 02 , 2024 | 04:54 PM
ఎన్ని స్థానాల్లో పోటీ చేసేమనేది కాదు, ఎన్ని ఎక్కువ సీట్లలో గెలిచామనే దానిపైనే కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ దిశగా 'ఇండియా' కూటమి చర్చల్లో ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.
న్యూఢిల్లీ: ఎన్ని స్థానాల్లో పోటీ చేసేమనేది కాదు, ఎన్ని ఎక్కువ సీట్లలో గెలిచామనే దానిపైనే కాంగ్రెస్ (Congress) పార్టీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ దిశగా 'ఇండియా' (INDIA) కూటమి చర్చల్లో ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర స్థాయి నేతలతోనూ, నేషనల్ అలయెన్స్ కమిటీతో విస్తృతంగా చర్చలు సాగిస్తోంది. తద్వారా ఏయే సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రానుంది. అనంతరం ఎంపిక చేసిన సీట్లు దక్కించుకునేందుకు ఇండియా కూటమి నేతలతో చర్చలు కొనసాగించనుంది.
కాంగ్రెస్ సంప్రందింపులు సాగించే రాష్ట్రాలు, ఆశిస్తున్న సీట్లు..
-ఉత్తరప్రదేశ్: యూపీలో 10కి పైగా సీట్లను కాంగ్రెస్ ఆశిస్తోంది. వీటిలో అమేథీ, రాయబరేలీ, షాజహాన్‌పూర్, మహారాజ్‌గంజ్, ఫరూఖాబాద్, కుషీనగర్, వారణాసి సీట్లు ఉన్నాయి.
-బీహార్: తొమ్మిదికి పైగా సీట్లు. వీటిలో ససరామ్, కతిహార్, కిషన్‌గంజ్, ఔరంగాబాద్, మోతిహార్, దర్బంగా ఉన్నాయి.
-జార్ఖండ్: 9కి పైగా సీట్లు ఆశిస్తోంది. వీటిలో హజారిబాగ్, రాంచీ, ధన్‌బాద్, ఖుంటీ, జంషెడ్‌పూర్, ఛాత్ర, పలము నియోజకవర్గాలు ఉన్నాయి.
-పశ్చిమబెంగాల్: జాంగీపూర్, బహరాంపూర్ సహా 6 సీట్లు
-పంజాబ్: ప్రస్తుతం ఎంపీగా ఉన్న అన్ని సీట్లలో పోటీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంది.
-మహారాష్ట్ర: 20కి పైగా స్థానాలు
-ఢిల్లీ: 3కు పైగా సీట్లు
నేషనల్ అలయెన్స్ కమిటీ నివేదిక తర్వాతే..
కాంగ్రెస్ పార్టీ ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా ఐదుగురు సభ్యులతో ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ అలయెన్స్ కమిటీ తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించనుంది. దీనికి ఆమోదం తెలిపిన వెంటనే భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్ చర్చలు మొదలుపెడుతుంది. దీనికి ముందే 'ఇండియా' బ్లాక్ భాగస్వాములతో ఈవారంలోనే కాంగ్రెస్ సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంది.