మదర్సాల్లో సమగ్ర విద్య కరువు
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:43 AM
మదర్సాలు విద్యార్థులకు సమగ్రమైన విద్యను అందించడంలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) అభిప్రాయపడింది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.
విద్యార్థుల ఎదుగుదలకు అవకాశాలు తక్కువ
సుప్రీంకు తెలిపిన బాలల హక్కుల కమిషన్
న్యూఢిల్లీ, అక్టోబరు 21: మదర్సాలు విద్యార్థులకు సమగ్రమైన విద్యను అందించడంలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) అభిప్రాయపడింది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఉత్తరప్రదేశ్ మదర్సా విద్యా బోర్డు చట్టం-2004ను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది. దీనికి సమాధానంగా ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్‌ను సమర్పించింది. మదర్సాలు సరైన విద్యను అందించడంలేదని, అందువల్ల విద్యార్థులు ఎదుగుదల అవకాశాలను కోల్పోతున్నారని తెలిపింది. విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా నిర్వహణ ఉండడంలేదని, యాజమాన్యం ఇష్టాయిష్టాలపైనే అవి నడుస్తున్నాయని తెలిపింది.
టీచర్ల నియామకం, వారి అర్హతలు, నిధుల సమీకరణ తదితర అంశాల్లో ఎక్కడా పారదర్శకతలేదని పేర్కొంది. ఖురాన్, ఇతర మత గ్రంథాలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన సంప్రదాయ పద్ధతుల్లోనే నడుస్తున్నాయని తెలిపింది. విద్యాయేతర కార్యకలాపాలు, ప్రయోగాలు వంటివేమీలేవని పేర్కొంది. ఇది అసంఘటిత విద్యారంగంగా మారిందని అభిప్రాయపడింది. పాఠ్యాంశాలపైనా అభ్యంతరం తెలిపింది. ముస్లింమత ఆధిక్యతను వ్యాప్తి చేసే దిశగా బోధన ఉంటోందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ముస్లిమేతర విద్యార్థులూ చదువుతున్నారని, అలాంటి వారికి ఈ బోధన ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది. చిన్న పిల్లల విషయంలో కొన్ని అభ్యంతరకరమైన పాఠాలు కూడా ఉన్నాయని తెలిపింది. ముస్లిమేతర భద్రత బలగాలపై ఆత్మాహుతి దాడులు చేస్తే ఎలా వ్యవహరించాలన్నదానిపై దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఫత్వా జారీ చేస్తూ దీనిపై స్థానిక పండితులను సంప్రదించాలని తెలిపిందని బాలల హక్కుల కమిషన్ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇది ఉగ్రవాదాన్ని సమర్థించేదిగా, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలాఉందని అభిప్రాయపడింది.