Share News

Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట

ABN , Publish Date - Nov 26 , 2024 | 02:52 PM

నాయకత్వంపై (సీఎం పదవిపై) బీజేపీ, శివసేన వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యానికి కారణంగా చెబుతున్నారు. మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వమే కీలకంగా నిలిచిందని శివనేత నేతలు బలంగా చెబుతున్నారు.

Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమికి సంపూర్ణ ఆధిక్యత కట్టబెడుతూ ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన తొలగలేదు. దీనిపై 'మహాయుతి' నేతలతో ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. అధికారికంగా సీఎం ఎవరనేది ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

Maharashtra CM: సీఎం పదవికి షిండే రాజీనామా.. ఫడ్నవీస్ వైపు బీజేపీ మొగ్గు


జాప్యానికి కారణమిదే..

నాయకత్వంపై (సీఎం పదవిపై) బీజేపీ, శివసేన వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యానికి కారణంగా చెబుతున్నారు. మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వమే కీలకంగా నిలిచిందని శివనేత నేతలు బలంగా చెబుతున్నారు. షిండే నాయకత్వంలో ఎన్నికలు జరిగాయని, ఆయననే సీఎంగా కొనసాగించడం కూటమి ఐక్యత, నాయకత్వానికి గౌరవప్రదంగా ఉంటుందని శివసేన ప్రతినిధి నరేష్ మాస్కే అన్నారు.


కాగా, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దరేకర్ సహా పలువురు బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవిస్‌కు తిరిగి సీఎం పదవి కట్టబెట్టాలని అంటున్నారు. బీజేపీ మునుపెన్నడూ లేనంతగా 132 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేసే బాధ్యత ఫడ్నవిస్‌కు అప్పగించడం ఉత్తమ ఎంపిక అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహాయుతి కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం ప్రకటించింది.


రాజ్యాంగ సంక్షోభం

నవంబర్ 26వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పాటు కాకుంటే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుందనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనను అధికారులు కొట్టివేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై ఎలక్షన్ కమిషన్ పబ్లికేషన్‌తో 15వ అసెంబ్లీ ఏర్పాటయిందని, తక్షణం వచ్చిపడే లీగల్ చిక్కులేవీ ఉండవని వారంటున్నారు. 288 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన-ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమి 230 సీట్లు సొంతం చేసుకుంది. విపక్ష 'మహా వికాస్ అఘాడి' 46 సీట్లకే పరిమితమైంది.


ఇవి కూడా చదవండి..

President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’

Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 26 , 2024 | 02:52 PM