Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు
ABN , Publish Date - Mar 27 , 2024 | 03:53 PM
తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రా (Mahua Moitra)ను ఫెమా నిబంధనల ఉల్లంఘన (FEMA contraventions) కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గతంలో కూడా ఆమెను ఈడీ సమన్లు జారీ చేసింది.
'అనైతిక ప్రవర్తన'కు పాల్పడ్డారనే కారణంగా గత డిసెంబర్‌లో మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి టిక్కెట్ ఇచ్చింది. 'ఫెమా' ఉల్లంఘటన కేసులో ఇంతకుముందు రెండు సార్లు ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19, మార్చి 11 తేదీల్లో ఈడీ విచారణకు ఆమె గైర్హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో విచారణకు హాజరుకావాలని ఈడీ తమ సమన్లలో కోరింది. క్యాష్ అండ్ క్యారీ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల ఆమె నివాసాలపై దాడులు జరిపిన నేపథ్యంలో ఈడీ మూడోసారి ఆమెకు తాజా సమన్లు జారీ చేసింది. దుబాయ్‌కి చెందిన పారిశ్రామిక వేత్త హీరానందాని తరఫున ఆమె పార్లమెంటులో గౌతమ్ అదానీ, ప్రధానిపై ప్రశ్నలు గుప్పించేవారని, ఇందుకు గాను హీరానందాని నుంచి ఆమె నగదు, బహుమతులు అందుకున్నారని ఈడీ ఆరోపణగా ఉంది. అయితే, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, అదానీ గ్రూప్‌ను ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని మహువా మొయిత్రి అంటున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.