Cooking Gas Price: వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2000.. మమతా బెనర్జీ హెచ్చరిక
ABN , Publish Date - Feb 29 , 2024 | 10:06 PM
ఒకవేళ బీజేపీ (BJP) మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తప్పకుండా వంట గ్యాస్ సిలిండర్ల (Cooking Gas Cylinders) ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) గురువారం అభిప్రాయపడ్డారు. మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. సిలిండర్ల ధర రూ.2000 పెరగొచ్చని పేర్కొన్నారు.
ఒకవేళ బీజేపీ (BJP) మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తప్పకుండా వంట గ్యాస్ సిలిండర్ల (Cooking Gas Cylinders) ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) గురువారం అభిప్రాయపడ్డారు. మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. సిలిండర్ల ధర రూ.2000 పెరగొచ్చని పేర్కొన్నారు. ‘‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 1,500 లేదా రూ. 2,000కి పెంచవచ్చు. అప్పుడు మనం మంటలను వెలిగించేందుకు, కలపను సేకరించే పాత పద్ధతికే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. జర్‌గ్రామ్ జిల్లాలో నిర్వహించిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ఆవాజ్ యోజన (Awas Yojana) కింద చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ ఒక సవాల్ విసిరారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే.. మే నెలలో తమ రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.
మరోవైపు.. నిత్యవసరాల ధరలు పెరిగిపోతుండటంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రోజులు గడిచేకొద్దీ ధరలు పెరుగుతున్నాయే తప్ప, తగ్గుముఖం పట్టడం లేదు. వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకోవడమే గానీ, ఆ దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనినే ప్రతిపక్షాలు తమ అస్త్రంగా మార్చుకొని, కేంద్రంపై దాడికి దిగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో రూ.450 మాత్రమే ఉండే గ్యాస్ ధరలను ఇప్పుడు రూ.955 దాకా తీసుకొచ్చారని, మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకా పెంచేస్తారని బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైవిధంగా వ్యాఖ్యానించారు. మరి, దీనిపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.