Share News

Mamata Banerjee: ఇండియా కూటమిలో బయటపడుతున్న లుకలుకలు.. కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వబోమన్న దీదీ

ABN , Publish Date - Jan 31 , 2024 | 05:48 PM

ఇండియా కూటమిలో(INDIA Alliance) లుకలుకలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. ఇటీవలే కూటమి కీలక నేత బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీఏ(NDA)తో జట్టుకట్టారు.

Mamata Banerjee: ఇండియా కూటమిలో బయటపడుతున్న లుకలుకలు.. కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వబోమన్న దీదీ

కోల్‌కతా: ఇండియా కూటమిలో(INDIA Alliance) లుకలుకలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. ఇటీవలే కూటమి కీలక నేత బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీఏ(NDA)తో జట్టుకట్టారు. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. మాల్దాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ.. తమతో పొత్తు కోరుకుంటే సీపీఎంతో కాంగ్రెస్(Congress) కటీఫ్ చెప్పాలని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు చర్చల క్రమంలో తాను కాంగ్రెస్‌కు 2 సీట్లు ఇవ్వాలని చూస్తే తిరస్కరించారని, ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తెలిపారు.

"గతంలో పలు సందర్భాల్లో సీపీఎం నాపై భౌతిక దాడి చేసింది. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే నేను బతికాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను, సీపీఎంను అసలే క్షమించను. సీపీఎంతో ఉన్నవాళ్లు బీజేపీతో కూడా ఉండొచ్చు. కాంగ్రెస్‌కు రెండు పార్లమెంటు స్థానాలు ఇచ్చి గెలిపించుకుంటానంటే వారు ఎక్కువ స్థానాలు కోరుకున్నారని, లెఫ్ట్‌ పార్టీలతో జట్టు కడితే ఒక్క సీటు కూడా ఇవ్వబోనని గతంలోనే చెప్పాను”అని ఆమె అన్నారు.


తృణమూల్‌తో పొత్తు ఉండదని సీపీఎం గతంలోనే తేల్చి చెప్పింది. 2023 జూన్‌లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. 'టీఎంసీ, సీపీఎం కలవడం జరగదు. బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా పోరాడే సెక్యులర్ పార్టీలుగా ఉంటాయి' అని ఆయన అన్నారు.

సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌తో అమీతుమీకి సిద్ధమైన ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ ఒకటి. కూటమి ఒప్పందాలకు విరుద్ధంగా ఆప్‌ నేత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీట్ల పంపకాల కోసం చర్చలు జరుగుతుండగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 16 మంది అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి తమకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఇలా ఇండియా కూటమిలోని నేతలు తోచిన దారిలో వెళ్తుండటం రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లో జరుగుతుండగా మరో వైపు దీదీ మాటలు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2024 | 05:53 PM