INDIA bloc meet: మోదీకి వ్యతిరేకంగా జనం తీర్పునిచ్చారు.. ఎన్డీయే సమావేశంలో ఖర్గే
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:32 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాతీర్పు వ్యక్తిగతంగా మోదీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతికపరమైన ఓటమి కూడా అని అభివర్ణించారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ప్రజాతీర్పు వ్యక్తిగతంగా మోదీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతికపరమైన ఓటమి కూడా అని అభివర్ణించారు. ప్రధాని మోదీ, ఆయన తరహా రాజకీయలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. అయినప్పటికీ ఆయన (మోదీ) ప్రజాభీష్టాన్ని కాలరాయడానికే కృతనిశ్చయంతో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి నేతలు శుక్రవారం సాయంత్రం ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా 30 మందికి పైగా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మల్లికార్జున్ ఖర్గే సమావేశాన్ని ప్రారంభిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా, దృఢ సంకల్పంతో పనిచేసిన 'ఇండియా' కూటమి నేతలు అభినందించారు. నరేంద్ర మోదీపై ప్రజల సెంటిమెంట్ గణనీయంగా మారినట్టు 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విస్పష్టంగా తెలిపాయని అన్నారు. మోదీ నాయకత్వంపైనే ఎన్నికల ప్రచారం భారీగా జరిగినప్పటికీ, ఆయన పేరు, ఇమేజ్‌పై ప్రచారం సాగించినప్పటికీ బీజేపీకి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైందని, తద్వారా మోదీ నాయకత్వాన్ని ప్రజలు తోసిపుచ్చినట్టు చాలా స్పష్టంగా తేలుతోందని అన్నారు.
NDA meet: మోదీ పేరు ఏకగ్రీవం.. రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు
''మోదీకి ఇది వ్యక్తిగతంగా రాజకీయ ఓటమి మాత్రమే కాదు. నైతికపరమైన ఓటమి కూడా. వాళ్ల (బీజేపీ) అలవాట్లు ఏమిటో మనందరికీ తెలుసు. ప్రజాభిప్రాయాన్ని తిరస్కరించేందుకు ఏమి చేయాలో అవన్నీ చేస్తారు. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని పరిఢవిల్లేలా చేసేందుకు కృషి చేసిన ఇండియా కూటమి పార్టీలను స్వాగతిస్తున్నాం'' అని ఖర్గే చెప్పారు.
33 మంది నేతలు హాజరు..
'ఇండియా' కూటమి సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు శరద్ పవార్ (ఎన్‌సీపీ), సుప్రియా సూలే (ఎన్‌సీపీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), టీఆర్ బాలు (డీఎంకే), అఖిలేష్ యాదవ్ (ఎస్‌పీ), రామ్‌గోపాల్ యాదవ్ (ఎస్‌పీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), అరవింద్ సావంత్ (శివసేన-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ యాదవ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), డి.రాజా (సీపీఐ), ఛంపాయ్ సోరెన్ (జేఎంఎం), కల్పానా సోరెన్ (జేఎంఎం), సంజయ్ సింగ్ (ఏఏపీ), రాఘవ్ చద్దా (ఏఏపీ), దీపక్ భట్టాచార్య (సీపీఐ-ఎంఎల్), ఒమర్ అబ్దుల్లా (జేకేఎన్‌సీ), సయ్యిద్ సిద్ధిఖి అలి సాహిబ్ థాంగల్ (ఐయూఎంఎల్), పీకే కున్హలికుట్టీ (ఐయూఎంఎల్), జోష్ కె మణి (కేసీ-ఎం), తిరు తోల్ తిరుమావళవన్ (వీసీకే), ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్‌పీ), డాక్టర్ ఎంహెచ్ జవహిరుల్లా (ఎంఎంకే), జి.దేవరాజ్న్ (ఏఐఎఫ్‌బీ), తిరు ఈఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), డి.రవికుమర్ (వీసీకే) హాజరయ్యారు.
For Latest News and National News Click Here