Manmohan Singh: నా పిల్లలకు ట్యూషన్ ఫీజు ఆఫర్ చేశారు.. మన్మోహన్ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న మలేషియా ప్రధాని
ABN , Publish Date - Dec 27 , 2024 | 06:34 PM
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్‌లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ: కేంబ్రిడ్జి గ్రాడ్యుయేట్, ఆక్స్‌ఫోర్డ్ పూర్వ విద్యార్థి, ప్రొఫెసర్, ఆర్థిక మంత్రి, రెండుసార్లు ప్రధానమంత్రి, అజాత శత్రువు...ఇది దివంగత మన్మోహన్ సింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు. భారతదేశ రాజకీయాల్లో విశిష్ట సేవలందించిన మన్మోహన్ ఇక లేరని తెలిసి ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖుల నుంచి సంతాపసందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికవేత్తగా, విద్యావేత్తగా మన్మోహన్‌కు ఉన్న ప్రతిభతో పాటు ఆయనతో తమకున్న వ్యక్తిగత స్నేహాన్ని తలుచుకుంటున్నారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్‌లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.
Manmohan Singh: దేశం బాగుందా? కశ్మీర్ ఎలా ఉంది?.. దటీజ్ మన్మోహన్
''గౌరవనీయులు, నా మిత్రుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇకలేరని తలుచుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన గొప్పతనాన్ని తెలిపే సంతాప సందేశాలు, వ్యాసాలు, పుస్తకాలు ఎన్నో వచ్చి ఉండొచ్చు. భారతదేశం ప్రపంచ శక్తిగా నిలిచేందుకు కృషి చేసిన ఆర్థిక దిగ్గజాలలో మన్మోహన్ ఒకరు. ఆయన సేవలు రాబోయే తరాలకు కూడా స్ఫూరిదాయకం'' అని అన్వర్ పేర్కొన్నారు. తాను సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన కుటుంబానికి సాయం చేసేందుకు మన్మోహన్ మందుకు రావడం కూడా ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు.
మలేషియా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అన్వర్ అబ్రహం 1998లో ఆ దేశంలో జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా చిక్కుల్లో పడ్డారు. మలేషియా క్యాబినెట్ నుంచి ఆయనను తొలగించారు. వివాదాస్పద అంతర్గత భద్రతా చట్టం కింద ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలతో జైల్లో పెట్టారు. కస్టడీలోనూ ఆయనపై దాడి జరిగిది. అన్వర్ చీకటి రోజులు ఎదుర్కొంటున్న తరుణంలో మన్మోహన్ సింగ్ ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ''ఆ సమయంలో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అది తెలిసిన మన్మోహన్ సింగ్ మా పిల్లలకు స్కాలర్‌షిప్ ఇస్తామని ముందుకు వచ్చారు. అయితే మలేసియా ప్రభుత్వానికి ఆ చర్య ఇష్టం ఉండదని తెలిసే మన్మోహన్ ఆఫర్‌ను సున్నితంగా తోసిపుచ్చాను" అని నాటి జ్ఞాపకాన్ని అన్వర్ గుర్తు చేసుకున్నారు. ''గుడ్‌బై, మై మిత్రా, మై భాయ్, మన్మోహన్'' అంటూ తన సంతాప సందేశాన్ని అన్వర్ ముగించారు.
ఇవి కూడా చదవండి...
Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో
Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు
Read More National News and Latest Telugu News