Share News

Manmohan Singh: తామరాకుపై నీటిబొట్టు..!

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:12 AM

అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేశారు! నాటి ప్రధాని పీవీ నరసింహారావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు!

Manmohan Singh: తామరాకుపై నీటిబొట్టు..!
Manmohan Singh

  • 33 ఏళ్లపాటు మన్మోహన్‌ సచ్ఛీల రాజకీయాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేశారు! నాటి ప్రధాని పీవీ నరసింహారావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు! ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’ అని.. ‘కీలుబొమ్మ’ అని రకరకాలుగా విమర్శలు చేసినా పట్టించుకోకుండా.. ప్రధానమంత్రిగా పదేళ్లపాటు దేశాన్ని సమర్థంగా నడిపించారు. ఆయనే మన్మోహన్‌సింగ్‌. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన ఆయన.. 33 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. కానీ, ఏనాడూ ఆ బురదను అంటించుకోలేదు. తామరాకుపై నీటి బొట్టులా.. చాకచక్యంగా వ్యవహరించారు. ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా.. ఇలా ఏ హోదాలో ఉన్నా తనదైన ముద్ర వేశారు. ‘‘1991 జూన్‌ 21న భారత ప్రధాని పీవీ నరసింహారావు నుంచి ఫోన్‌ వచ్చింది.


మన్మోహన్‌జీ మీరెక్కడున్నారు? అని పీవీ అడిగారు. నేను యూజీసీలో ఉన్నానని చెప్పా. మీకు అలెగ్జాండర్‌ ఏమీ చెప్పలేదా? అని పీవీ అడిగారు. చెప్పారు కానీ, నేను సీరియ్‌సగా తీసుకోలేదని అన్నాను. ‘లేదు.. ఇది చాలా సీరియస్‌, మీరు ఇంటికి వెళ్లి డ్రెస్‌ చేసుకుని ప్రమాణ స్వీకారానికి రండి’ అని పీవీ చెప్పారు’’ అని తాను ఆర్థిక మంత్రిని ఎలా అయ్యానన్న విషయాన్ని స్వయంగా మన్మోహన్‌ సింగే వెల్లడించారు. 2018 డిసెంబరులో తన పుస్తకం ‘చేంజింగ్‌ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. యూజీసీ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తుండగా ప్రధాని పీవీ ఫోన్‌ చేయడంతో వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని మన్మోహన్‌ చెప్పగా.. సభలో నవ్వులు విరిశాయి. అలా 1991లో అనూహ్యంగా ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్‌ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎ్‌ఫను ఒప్పించి భారత్‌ను ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేశారు. పీవీ ఇచ్చిన మనోధైర్యం వల్లే తాను ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేయగలిగానని వెల్లడించారు. భారత ప్రాధాన్యాలకు అనుగుణంగా సంస్కరణలను అమలు చేస్తామంటూ అప్పటి ఐఎంఎఫ్‌ ఎండీ మైకేల్‌ కాండెస్స్‌సకు పీవీ చెప్పారన్నారు.

30.jpg


రాజీనామా.. తిరస్కరించిన పీవీ..

పీవీ హయాంలో స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై నివేదిక సమర్పిస్తూ మన్మోహన్‌ సింగ్‌ మొద్దు నిద్ర పోతున్నారని జేపీసీ వ్యాఖ్యానించింది. మనస్తాపం చెందిన ఆయన రాజీనామా చేశారు. కానీ, పీవీ దాన్ని ఆమోదించలేదు. పీవీకి,మన్మోహన్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో మన్మోహన్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి పీవీనే స్వయంగా జవాబిచ్చేవారు.


అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు..

2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియాగాంధీ అనూహ్యంగా ప్రధాని బాధ్యతలు మన్మోహన్‌ సింగ్‌కు అప్పగించారు. విదేశీయురాలనే పేరుతో శరద్‌ పవార్‌, ములాయంసింగ్‌ యాదవ్‌లు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించడం, సోనియా ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌ హెచ్చరించడంతో ప్రధాని పదవిని స్వీకరించలేదు. పాలనాదక్షుడైన మన్మోహన్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. మన్మోహన్‌ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తే.. తెర వెనక కూటమి సర్కారు రాజకీయాలను సోనియా నిర్వహించారు. 2009లో యూపీఏ రెండోసారి గెలిచినప్పుడు కూడా ప్రధాని పదవి ఆశిస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ, చిదంబరాన్ని పక్కనపెట్టిన సోనియా.. మరోసారి మన్మోహన్‌పైనే భరోసా ఉంచారు. ఆయన రెండోసారి ప్రధానిగా ఉన్న కాలంలో 2జీ స్పెక్ట్రమ్‌ వేలం, బొగ్గు గనుల వేలం తదితర నిర్ణయాల్లో కుంభకోణాలు జరిగాయి.


అయితే అదే సమయంలో కుంభకోణాలకు పాల్పడిన మంత్రులు, అధికారులు జైలు పాలైనా మన్మోహన్‌ సింగ్‌పై ఎలాంటి మచ్చా పడలేదు. రాజకీయాల్లో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ ఆయన తాను చేరిన కాంగ్రెస్‌ పార్టీకి విధేయంగా పనిచేశారు. తనకంటూ సొంత రాజకీయ బృందాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఏనాడు ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రాలేదు. పార్టీ వ్యవహారాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదు. సోనియా, ఆమె రాజకీయ బృందం ఓవైపు.. మన్మోహన్‌ మరోవైపు.. ఎవరి రంగంలో వారు బలంగా పనిచేసేవారు. అదే సమయంలో కేబినెట్‌ సమావేశాల్లో మన్మోహన్‌దే తుది నిర్ణయంలా ఉండేది. ఆయన్ను సోనియా ఎన్నడూ అగౌరవపరిచిన దాఖలాలు లేవు. అయితే కోర్‌ గ్రూప్‌ సమావేశాలు సోనియా నివాసంలో జరిగేవని, కొన్నిసార్లు మన్మోహన్‌ అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు, నియామకాలు జరిగేవని, ఆయన అసంతృప్తిగా ఉండేవారని ఆయన మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌ బారు తన పుస్తకం ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’లో రాశారు. కానీ, మన్మోహన్‌ అధికార ప్రతినిధి ఈ విషయాలను ఖండించారు.


నాకంటే మన్మోహనే మంచి ప్రధాని..

‘నాకంటే మన్మోహన్‌ సింగ్‌ మంచి ప్రధాని అవుతారని నాకు తెలుసు. అందుకే నేను ఆ పదవి తీసుకోలేదు’ అని సోనియా ఓ సందర్భంలో చెప్పారు. కాంగ్రెస్‌ 2014లో ఓడినప్పటికీ అందుకు మన్మోహన్‌ను ఎవరూ నిందించలేదు. ఆయన్ను కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో ఆరోపించినా పట్టించుకోలేదు. చివరిసారిగా 2019లో రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ అనారోగ్యం వల్ల ఎక్కువ రోజులు హాజరు కాలేకపోయారు. చక్రాల కుర్చీలో వచ్చి పార్లమెంటు ఓటింగ్‌లో పాల్గొనేవారు.

31.jpg

31.jpg

31.jpg

Updated Date - Dec 27 , 2024 | 03:48 PM