Share News

Minister: వరద సహాయ నిధులు అందించనున్నట్లు ప్రధాని హామీ ఇచ్చారు..

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:39 PM

రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని భర్తీచేసేలా సహాయ నిధులను అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు హామీ ఇచ్చారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పేర్కొన్నారు.

Minister: వరద సహాయ నిధులు అందించనున్నట్లు ప్రధాని హామీ ఇచ్చారు..

- మంత్రి ఉదయనిధి స్టాలిన్‌

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని భర్తీచేసేలా సహాయ నిధులను అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు హామీ ఇచ్చారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని తో భేటీ అయిన అనంతరం మంత్రి ఉదయనిధి విమానం ద్వారా గురువారం రాత్రి 11.30 గంటలకు చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రప్రభుత్వం తరఫున సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా ‘ఖేలో ఇండియా’ క్రీడా పోటీలు ఈనెల 19వ తేది నుంచి జరుగుతాయని, ఈ పోటీలు ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీ(Prime Minister Modi)ని నేరుగా వెళ్లి కలుసుకొని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆ సమయంలో తూత్తుకుడి, తిరునల్వేలి, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లో వరద నష్టాల వివరాలను ప్రధానికి మళ్లీ గుర్తుచేశానని, అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించి కేంద్రప్రభుత్వం తరఫున వరద సహాయ నిధులు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఢిల్లీలో తాను మర్యాదపూర్వకంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని సంప్రదించి 10 నిమిషాలు మాట్లాడుకున్నామని, ఆయన చేపట్టనున్న మణిపూర్‌ పాదయాత్ర విజయవంతం కావాలని రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఉదయనిధి పేర్కొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 01:39 PM