Share News

Minister Udayanidhi: నాకు ఉపముఖ్యమంత్రి పదవి.. అంతా ఉత్తిదే..

ABN , Publish Date - Jan 10 , 2024 | 08:08 AM

డీఎంకే యువజన మహానాడు ముగిసిన తర్వాత తనను ఉపముఖ్యమంత్రిగా నియమించనున్నారంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) కొట్టిపారేశారు.

Minister Udayanidhi: నాకు ఉపముఖ్యమంత్రి పదవి.. అంతా ఉత్తిదే..

- మంత్రి ఉదయనిధి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే యువజన మహానాడు ముగిసిన తర్వాత తనను ఉపముఖ్యమంత్రిగా నియమించనున్నారంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) కొట్టిపారేశారు. ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన తాత కరుణానిధి హయాంలో తన తండ్రి స్టాలిన్‌ యువజన విభాగం అధ్యక్షుడిగా పార్టీకి విశిష్టమైన సేవలందించటం వల్లే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారని తెలిపారు. తన తండ్రికి విశేషానుభవం కలిగి ఉండటం వల్లే చెన్నై మేయర్‌గా, మంత్రిగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా, డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడిగా పలు పదవుల్లో రాణించ గలిగారన్నారు. ఇప్పుడు అదే బాటలో తాను కూడా ఉపముఖ్యమంత్రిని అవుతానని కొంతమంది భావిస్తున్నారన్నారు. తాను డీఎంకే యువజన విభాగ పగ్గాలు పట్టినప్పటి నుంచే ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు. యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), పార్టీ సీనియర్ల అభిప్రాయం మేరకు తనకు మంత్రి పదవి వరించిందన్నారు. ఈ నెల 21న సేలంలో డీఎంకే యువజన విభాగం మహానాడు ముగిసిన తర్వాత తనకు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉదయనిధి పేర్కొన్నారు. ఇదిలా వుండగా మంగళవారం మంత్రి ఉదయనిధి నెహ్రూ స్టేడియానికి వెళ్లి ఉన్నతాధికారులతో కలిసి ‘ఖేలో ఇండియా’ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Jan 10 , 2024 | 08:09 AM