Modi 3.0: కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు..!
ABN , Publish Date - Jun 06 , 2024 | 04:35 PM
సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బుధవారం న్యూడిల్లీలో సమావేశమయ్యాయి. ఆ క్రమంలో ఎన్డీయే అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్నాయి. అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్‌లుగా అవతరించారు.
న్యూఢిల్లీ, జూన్ 06: సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ( NDA allies) బుధవారం న్యూడిల్లీలో సమావేశమయ్యాయి. ఆ క్రమంలో ఎన్డీయే అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్నాయి. అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Telugu Desam Party Chief N ChandraBabu Naidu), జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ (JD(U) Chief Nitish Kumar), కింగ్ మేకర్‌లుగా అవతరించారు. ఇక ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేపట్టేందుకు ముహుర్తం సైతం ఖారారు అయింది.
అలాంటి వేళ కేంద్ర మంత్రి వర్గం కూర్పుపై భాగస్వామ్య పక్షాల అధినేతలతో బీజేపీ కీలక నేతల చర్చలు గురువారం వాడి వేడిగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అందులోభాగంగా ఆ పార్టీ కీలక మంత్రిత్వ శాఖలు కోరుతుండడంతో.. కమలం పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇక బిహార్ సీఎం నితీష్ కుమార్ సైతం అత్యంత ప్రాధాన్య మంత్రిత్వ శాఖల కోసం పట్టుబడుతున్నారని తెలుస్తుంది. మరోవైపు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ పరిథిలోకి వచ్చే హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు శాఖలను తమ వద్ద ఉంచుకోవాలని ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక లోక్‌సభ స్పీకర్ పోస్ట్ కోసం టీడీపీ కోరగా.. ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు.. అలాగే రాజ్యసభ డీప్యూటీ చైర్మన్ పదవి జేడీ(యూ) నేతకు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది. రైల్వే శాఖను నితీష్ కుమార్ కోరగా.. ప్రస్తుతం ఆ శాఖలో సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టామని ఆయనకు బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆ శాఖ సైతం బీజేపీ నేతలు ఇచ్చేది లేదని చెప్పినట్లు అయింది. గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన నితీష్ కుమార్ విషయం విధితమే.
మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 272 మించి లోక్‌సభ స్థానాలను గెలుచుకొంది. దాంతో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేసుకుంది. అలాగే భాగస్వామ్య పార్టీలకు కీలక మంత్రిత్వ శాఖలు కాకుండా ఇతర శాఖలను కేటాయించింది. కానీ నేడు ఆ పరిస్థితి బీజేపీకి లేదు. ఎందుకంటే.. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాలు కీలకం కానున్నాయి. దాంతో ఆ యా పార్టీలకు అత్యంత ప్రాధాన్యమైన శాఖలు కేటాంచక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. దీంతో మంత్రి పదవులపై సాధ్యమైనంత తొందరగా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ భాగస్వామ్య పక్షాలు టీడీపీ (TDP) 16 స్థానాలు, జనతాదళ్ (యూ) JD(U) 12, ఏక్‌నాథ్ శిండే శివసేన పార్టీ (Eknath Shinde's Shiv Sena) 7, లోక్ జనశక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) (Chirag Paswan's Lok Janshakti Party-Ram Vilas) 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కీలక శాఖలు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. టీడీపీ సైతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. దీంతో అశోక్ గజపతి రాజుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి, సుజనా చౌదరికి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి పదవులు కేటాయించిన విషయం విధితమే.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News