DK Shivakumar: కలబురగి సహా 20 సీట్లలో కాంగ్రెస్‌దే గెలుపు.. డీకే ధీమా
ABN , Publish Date - Mar 17 , 2024 | 07:13 PM
మల్లికార్జున్ ఖర్గే అంటే భయం కారణంగానే ఆయన సొంత జిల్లా కులబురగి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని, కలబురగి సహా రాష్ట్రంలో 20 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.
బెంగళూరు: మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సొంత జిల్లా కులబురగి (Kalaguragi) నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. మల్లికార్జున్ ఖర్గేను చూసి మోదీ భయపడుతున్నారని, అందుకే కలబురగి నుంచి ప్రచారం ప్రారంభించారని అన్నారు. కలబురగితో సహా రాష్ట్రంలో 20 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కలబురగి నుంచి మోదీ శనివారంనాడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శివమొగ్గలో ఆయన తదుపరి ప్రచారం ఉండనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 దక్కించుకుంది. కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతా అంబరీష్ బీజేపీ మద్దతుతో గెలుపొందారు. హసన్ సీటును జేడీయూ దక్కించుకుంది. అయితే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో జేడీయూ పొత్తు పెట్టుకుంది.