Share News

MP Kanimozhi: గవర్నర్‌పై ఎంపీ కనిమొళి ఫైర్.. జాతిపితను కించపరుస్తారా? మీరేమైనా గాడ్సేకు చెందినవారా?

ABN , Publish Date - Jan 27 , 2024 | 12:37 PM

దేశ జాతిపిత గాంధీ కాదని, సుభాష్‌ చంద్రబోస్‌ అంటూ ఇటీవల గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) చేసిన వ్యాఖ్యలపై డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి(Kanimoli) స్పందించారు.

MP Kanimozhi: గవర్నర్‌పై ఎంపీ కనిమొళి ఫైర్.. జాతిపితను కించపరుస్తారా? మీరేమైనా గాడ్సేకు చెందినవారా?

- గవర్నర్‌పై కనిమొళి ఆగ్రహం

పెరంబూర్‌(చెన్నై): దేశ జాతిపిత గాంధీ కాదని, సుభాష్‌ చంద్రబోస్‌ అంటూ ఇటీవల గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) చేసిన వ్యాఖ్యలపై డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి(Kanimoli) స్పందించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‏ను ప్రశంసించడం తప్పు కాదు. అదే సమయంలో జాతిపిత అయిన గాంధీని కించపరచేలా మాట్లాడడమేంటి... మీరేమైనా గాడ్సేకు చెందినవారా?’ అంటూ గవర్నర్‌ను కనిమొళి ప్రశ్నించారు. తెన్‌కాశిలో ఆమె భాషోద్యమకారుల సంస్మరణ సభలో మాట్లాడుతూ... అయోధ్య రామాలయ కార్యక్రమానికి వెళ్లరాదని, ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయరాదని డీఎంకే ప్రభుత్వ నిర్బంధించినట్లు ఆరోపించడం సరికాదన్నారు. దేవుడిపై నమ్మకం ఉన్నా, లేకున్నా ఆలయాలు, భక్తుల భద్రతకు రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డీఎంకే ప్రభుత్వ హయాంలోనే అన్ని ఆలయాలకు కుంభాభిషేకం నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నారు. బోస్‌ అంటే రాష్ట్రప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆయన చరిత్ర ఎల్లప్పుడూ స్మరించుకుంటూ నివాళి అర్పిస్తుంటారని అన్నారు.

ఇతర దేశాల్లో అయితే జైల్లో పెట్టేవారు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీటర్‌ ఆల్ఫోన్స్‌

జాతిపిత గాంధీపై రాష్ట్ర గవర్నర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇతర దేశాల్లో అయితే జైల్లో పెట్టేవారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మైనార్టీల సంఘం అధ్యక్షుడు పీటర్‌ ఆల్ఫోన్స్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని జాతిపిత కాదని గవర్నర్‌ చెప్పడం గర్హనీయమన్నారు. రామరాజ్యం అందిస్తున్నామంటూ ప్రధాని మోదీ గొప్ప లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించడం ఇందులో భాగమేనా అని ప్రశ్నించారు. వచ్చే రిపబ్లిక్‌డే వేడుకల నాటికి మహాత్మాగాంధీ కోరుకున్న రాజ్యం రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఏర్పడడం ఖాయమని పీటర్‌ చెప్పారు.

Updated Date - Jan 27 , 2024 | 12:38 PM