Share News

Sanjay Raut: మమతను అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

ABN , Publish Date - Jul 28 , 2024 | 05:01 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా మైక్ కట్టివేయడం ఆమెను అవమానించడమేనని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మైక్ ఆపేసే ప్రక్రియ ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధమని చెప్పారు.

Sanjay Raut: మమతను అవమానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'నీతి ఆయోగ్' (NITI Aayog) సమావేశంలో పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రసంగిస్తుండగా మైక్ కట్టివేయడం ఆమెను అవమానించడమేనని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మైక్ ఆపేసే ప్రక్రియ ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. నీతి ఆయోగ్ అంటే ఆర్థిక కమిషన్ అని, దానిని పండిట్ జహహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ పేరును నీతి ఆయోగ్‌గా మార్చినంత మాత్రాన ఆ పేరు చెప్పి రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఉంటాయని, వాటిని తెలిపేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.


మా సీఎం ఉత్త చేతులతో వచ్చారు..

కేంద్ర బడ్జెట్‌లో మహారాష్ట్రకు నిధుల కేటాయింపు, పన్నుల పంపిణీ వ్యవహారంపై కూడా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. కేంద్రం కేటాయించిన నిధులు దేశ ప్రజలకు చెందినవని, వివిధ పన్నుల రూపేణా వీటిని వసూలు చేస్తుంటారని చెప్పారు. అలాంటప్పుడు మహారాష్ట్రకు బడ్జెట్‌లో దక్కిందేమిటి? అని ప్రశ్నించారు. తమ ముఖ్యమంత్రి ఖాళీ చేతులతో తిరిగొచ్చారని విమర్శించారు.

Mann Ki Baat: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన మన అథ్లెట్‌ను ఉత్సాహపరచండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ


మమత వివాదం..

కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయించి తమ రాష్ట్రాల పట్ల వివక్ష చూపారంటూ పలు రాష్ట్రాల సీఎంలు 'నీతి ఆయోగ్' సమావేశాన్ని బహిష్కరించగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే, సమావేశం నుంచి ఆమె వాకౌట్ చేశారు. తాను మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆమె ఆరోపించారు. ఏపీ, గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చారని ఆరోపించారు. తదుపరి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని చెప్పారు. కాగా, మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రసంగానికి కేటాయించిన పూర్తి సమయాన్ని మమత ఉపయోగించుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. కొందరు ముఖ్యమంత్రులు స్వయంగా రిక్వెస్ట్ చేసుకుని తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడారని, వారికి అదనపు సమయం కేటాయించారని చెప్పారు. సీఎం మమతా బెనర్జీతో సహా ఏ ఒక్కరి మైకులు స్విచ్ఛాఫ్ చేయలేదనీ, కేవలం అబద్ధాల ప్రచారానికి మమత దిగారని తెలిపారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 05:01 PM