ఎన్‌పీఎస్-వాత్సల్య పథకం రేపు ప్రారంభం
ABN , Publish Date - Sep 17 , 2024 | 02:55 AM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల బడ్జెట్‌లో ప్రకటించిన నేషన్ పెన్షన్ స్కీం(ఎన్‌పీఎ్‌స)-వాత్సల్య పథకం సాకారం దాల్చనుంది.
బాల్యం నుంచే పిల్లల పేరిట తల్లిదండ్రులు
పెన్షన్ ఫండ్‌లో జమ చేసే చాన్స్ ఏడాదికి కనీసం రూ.1,000
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల బడ్జెట్‌లో ప్రకటించిన నేషన్ పెన్షన్ స్కీం(ఎన్‌పీఎ్‌స)-వాత్సల్య పథకం సాకారం దాల్చనుంది. ఈ పథకాన్ని బుధవారం ఆమె ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. పిల్లలు పసివారుగా ఉన్నప్పుడే వారు పేరున తల్లిదండ్రులుగానీ, సంరక్షకులుగానీ ఎన్‌పీఎ్‌స-వాత్సల్య ఖాతాలను ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నుండి వారు మేజర్లయిన తరువాత ఆ ఖాతాలు ఆటోమేటిక్‌గా రెగ్యులర్ ఎన్‌పీఎ్‌స ఖాతాలుగా మారిపోతాయి. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కలిగించడం కూడా ఈ పథకం ఆశయాలు.
భారత పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, ఓవర్సీస్ సిటిజెన్స్ కూడా తమ పిల్లల పేరున ఈ ఖాతాలను ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం 1,000 జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ పొదుపు ద్వారా తల్లిదండ్రులు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం 80సీ కింద లభిస్తున్న రూ.1,50,000 మినహాయింపునకు ఇది అదనం. సెక్షన్ 80(సీసీడీ)(1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లు నిండిన తరువాత అప్పటి వరకు జమయిన సొమ్ములో 60 శాతాన్ని ఏకమొత్తంగా తీసుకోవచ్చు. ఖాతాదార్లు మైనర్లయినప్పటికీ వారికి పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాణ్)ను కేటాయిస్తారు.