Delhi: భారత్ బంద్ పాక్షికం.. బిహార్‌లో బడి బస్సుకు నిప్పు
ABN , Publish Date - Aug 22 , 2024 | 05:55 AM
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా బుధవారం బంద్ జరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా బుధవారం బంద్ జరిగింది. ది రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి, ఇతర ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు నిరసనకారులు బంద్‌లో పాల్గొన్నారు. పలు చోట్ల ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు.
వాహనరాకపోకలను, పలు రైళ్లను అడ్డుకున్నారు. అయితే బంద్ ప్రభావం దేశంలో పెద్దగా కనిపించలేదు. బిహార్ రాజధాని పాట్నాలో లోక్‌సభ ఎంపీ పప్పు యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బంద్‌కు ఆర్జేడీ, ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు తెలిపాయి.
గోపాల్‌గంజ్‌లో 35 మంది పిల్లలతో వెళ్తున బస్సుకు కొందరు నిరసనకారులు నిప్పుపెట్టారు. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అటు రాజస్థాన్‌లో బంద్ దృష్ట్యా ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిపిలివేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఢిల్లీలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.