Share News

NDA meet: మోదీ పేరు ఏకగ్రీవం.. రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:15 PM

కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది.

NDA meet: మోదీ పేరు ఏకగ్రీవం.. రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే (NDA) కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ (Narendra Modi) పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో ఈ నిర్ణయిం తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను కూటమి కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జేడీయూ నేత నితీష్‌ కుమార్ అందజేశారు.


రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే ప్రతినిధుల బృందం

కాగా, ఎన్డీయే కీలక సమావేశం పూర్తికావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కలుసుకునేందుకు ఎన్డీయే ప్రతినిధి బృందం సిద్ధమవుతోంది. రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతిని కలుసుకోనున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని ప్రతినిధి బృందం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందజేయనుంది. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ఈనెల 8న ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.


17వ లోక్‌సభ రద్దు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకున్నప్పటికీ మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 272ను అవలీలగా దాటింది. కాగా, 18వ లోక్‌సభ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ, 17వ లోక్‌సభను రద్దు చేయాల్సిందిగా కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రభుత్వ రాజీనామాను ప్రధాన మోదీ స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు.

Updated Date - Jun 05 , 2024 | 10:58 PM