PM Modi: వంద రోజుల్లో మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం: మోదీ
ABN , Publish Date - Feb 05 , 2024 | 06:31 PM
వంద రోజుల్లో మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
న్యూఢిల్లీ: వంద రోజుల్లో మూడోసారి ఎన్డీయే (NDA) అధికారంలోకి రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ అని ఖర్గే కూడా అంటున్నారని నవ్వుతూ చెప్పారు. బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 400కు పైనే సీట్లు వస్తాయన్నారు.
ప్రతిపక్షాలు ఈసారి కూడా ప్రతిపక్షంలోనే ఉంటారని ప్రధాని తెగేసి చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. కాంగ్రెస్ మళ్లీ ఒకే ప్రాడెక్ట్‌ను మళ్లీ లాంచ్ చేసే ప్రయత్నం చేస్తోందని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విపళ ప్రాడెక్ట్‌ను ఎన్ని సార్లు లాంచ్ చేస్తారని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్ పరాకాష్ట అని విమర్శించారు. ఇతర విపక్ష పార్టీలను కాంగ్రెస్ ఎదగనీయలేదని, పార్లమెంటును, విపక్షాన్ని, దేశాన్ని పతనావస్థకి తీసుకెళ్లారని అన్నారు. దేశానికి బలమైన విపక్షం అవసరమన్నారు. ''కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూడండి. ఖర్గే (మల్లికార్జున్ ఖర్గే) సభ నుంచి వెళ్లిపోయారు. గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్ మాజీ నేత) పార్టీని వదలి వెళ్లారు'' అని సూటిగా విమర్శించారు.