Share News

NEET: 'నీట్' పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు: సుప్రీం కోర్టు

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:51 AM

వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(NEET)లో ఇకపై గ్రేస్ మార్కులు ఉండబోవని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. నీట్, యూజీ 2024 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నీట్ కౌన్సెలింగ్‌ని ఆపేది లేదని కోర్టు స్పష్టం చేసింది.

NEET: 'నీట్' పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు: సుప్రీం కోర్టు

ఢిల్లీ: వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(NEET)లో ఇకపై గ్రేస్ మార్కులు ఉండబోవని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.

నీట్, యూజీ 2024 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నీట్ కౌన్సెలింగ్‌ని ఆపేది లేదని కోర్టు స్పష్టం చేసింది.


నీట్ 2024కి హాజరైన 1,563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని, వారు మళ్లీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారికి జూన్ 23న మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. మళ్లీ పరీక్ష రాయడానికి ఇష్టపడని వారికి గ్రేస్ మార్కులు లేకుండానే ఫలితాలు ప్రకటిస్తామని కోర్టు వివరించింది.

అసలేం జరిగిందంటే..

నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలు హైకోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) కోరింది. ఈ విషయమై తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

కొందరికి గ్రేస్‌ మార్కులు కేటాయించడం, పేపర్‌ లీక్‌, ఇతర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలంటూ కోర్టులు ఆదేశించిన నేపథ్యంలో ఎన్టీఏ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఏడు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయని ఎన్టీఏ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేసింది.


మరోవైపు 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ‘ఫిజిక్స్‌ వాలా’ సంస్థ సీఈవో అలఖ్‌ పాండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాండే పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై గురువారం విచారణ జరిపింది. నీట్‌-యూజీ పరీక్షలో కొద్ది మంది అవకతవకలకు పాల్పడితే పేపర్‌ లీకైనట్లు కాదని ఎన్‌టీఏ డీజీ సుబోధ్‌ సింగ్‌ అన్నారు.

‘‘‘నీట్‌-యూజీ పరీక్షకు సంబంధించి 63 మంది విద్యార్థులు అక్రమాలకు పాల్పడినట్లు తెలింది. ఇందులో 23 మంది పరీక్ష సమయంలో డిబార్‌ అయ్యారు. మిగిలింది 40 మంది. ఈ కొద్ది మంది విద్యార్థులు అవకతవకలకు పాల్పడితే పేపర్‌ లీకేజీ జరిగినట్లు కాదు. దాని వల్ల నీట్‌ పరీక్ష పవిత్రత ఏమాత్రం దెబ్బతినదు’’ అని సుబోధ్‌సింగ్‌ అన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 12:53 PM