Nirmala Sitharaman: ప్రత్యేక నిధిగా చెన్నైకి రూ.5వేల కోట్లిచ్చాం!
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:10 AM
చెన్నై నగరానికి ప్రత్యేక నిధిగా కేంద్రం నుంచి రూ.5వేల కోట్ల మేరకు నిధులిచ్చామని, ఆ నిధుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు తేల్చాల్సిన బాధ్యత డీఎంకే ప్రభుత్వానిదేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు.
- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
చెన్నై: చెన్నై నగరానికి ప్రత్యేక నిధిగా కేంద్రం నుంచి రూ.5వేల కోట్ల మేరకు నిధులిచ్చామని, ఆ నిధుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు తేల్చాల్సిన బాధ్యత డీఎంకే ప్రభుత్వానిదేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. పల్లావరంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికల కోసం కచ్చాదీవి వివాదాన్ని తెచ్చినట్లు బీజేపీపై డీఎంకే తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ కచ్చాదీవిని తలనొప్పి పుట్టించే సమస్యగా పేర్కొన్నారని చెప్పారు. ఇదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కచ్చాదీవిని ఓ బండరాళ్లగుట్టగా చెప్పారని తెలిపారు. కచ్చాదీవిని ధారాదత్తంచేసి, డీఎంకే కాంగ్రెస్ పార్టీలు తమిళ ప్రజలకు తీరని ద్రోహం చేశాయన్నారు. ఇక రాష్ట్రంలో వరదలు వచ్చిన వెంటనే కేంద్రం రూ.900 కోట్ల మేరకు నిధులు విడుదల చేసిందని ఆ నిధులను డీఎంకే ప్రభుత్వం ఎలా ఖర్చుపెట్టిందన్న వివరాలను కూడా ప్రకటించాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అడ్డూ అదుపులేకుండా సాగుతోందన్నారు. రామేశ్వరంలో మాదక ద్రవ్యాలు పట్టుబడినా అదంతా గుజరాత్‌లో పట్టుబడినవంటూ రాష్ట్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.
ఇదికూడా చదవండి: Kamala Haasan: రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజల బాధ్యత..