Interim Budget: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎన్ని గంటలకు ప్రవేశపెడుతున్నారంటే..
ABN , Publish Date - Feb 01 , 2024 | 07:19 AM
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానున్నారు. నిర్మలా సీతారామన్ ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుని...
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానున్నారు. నిర్మలా సీతారామన్ ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుని... అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. అనంతరం 10గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఉదయం 11.05 గంటలకు నిర్మలా సీతారామన్ లోకసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కాగా 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తున్నారు.
కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరోసారి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్ అయినందు వల్ల ఎలాంటి ప్రకటనలు వెలువడుతాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ఎన్నికలపరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చన్న అంచనాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కాగా, నిర్మల ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును సమం చేయనున్నారు. 2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన పది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.