Share News

NItin Gadkari : ఫైలుపై బరువుంటేనే వేగంగా కదులుతుంది..

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:04 AM

ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే దానిపై బరువు (డబ్బు) ఉండాల్సిందేనని..

NItin Gadkari : ఫైలుపై బరువుంటేనే వేగంగా కదులుతుంది..

  • ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిపై కేంద్రమంత్రి నితీన్‌ గడ్కరీ

  • మన వ్యవస్థలో కొందరు ‘న్యూటన్‌ ఫాదర్స్‌’ ఉన్నారు..

పుణే, సెప్టెంబరు 16: ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే దానిపై బరువు (డబ్బు) ఉండాల్సిందేనని.. అప్పుడే అది వేగంగా కదులుతుందని వ్యాఖ్యానించారు. పుణేలోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పుణే టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (సీఓఈపీటీయూ)లో పూర్వ విద్యార్థులు నిర్వహించిన ‘ఇంజనీర్స్‌ డే’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత, సమయానుకూల నిర్ణయాధికారం, పనుల అవశ్యకతపై మాట్లాడారు.

హైవే ప్రాజెక్టులు, రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాలను ఉదహరిస్తూ.. సమస్యలన్నింటికీ మూలకారణం తప్పుడు వివరాలతో కూడిన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లేనని అభిప్రాయపడ్డారు. రోడ్లపై గుంతలనూ పూడ్చాల్సిన అవసరముందని చెప్పారు. ఆదేశాలిస్తే తప్పా ఏ పని చేయని అధికారులున్నారన్నారు. అయితే జ్ఞానమున్న వారు కూడా చట్టం వెనకాల స్ఫూర్తిని అర్థం చేసుకోకుంటే ఏం లాభమని ప్రశ్నించారు. ‘నేను ఈరోజు ఇలా మాట్లాడకూడదు. ఇతర పనుల్లో డబ్బు వచ్చే చోట మీరు (అధికారులు) వేగంగా పని చేస్తారు. లేకపోతే చేయరు.. మన వ్యవస్థలో కొందరు ‘న్యూటన్‌ ఫాదర్స్‌’ ఉన్నారు. ఫైలుపై బరువు (డబ్బు) ఉంటే తప్ప కదలనీయరు’ అని అన్నారు. వర్సిటీ పూర్వ విద్యార్థుల్లో టెస్లా, జేపీ మోర్గాన్‌ వంటి బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న వారితో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులున్నారు. వారిలో పలువురికి సీఓఈపీ అభిమాన్‌ అవార్డు అందజేశారు.

Updated Date - Sep 17 , 2024 | 03:10 AM