Share News

Nitin Gadkari: విదేశాల్లో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే సిగ్గుతో ముఖం దాచుకుంటున్నా

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:38 AM

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, అంతర్జాతీయ సదస్సుల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తే సమాధానం చెప్పలేక సిగ్గుతో ముఖాన్ని దాచుకోవాల్సి వస్తోందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Nitin Gadkari: విదేశాల్లో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే  సిగ్గుతో ముఖం దాచుకుంటున్నా

  • ఏటా ప్రమాదాల్లో 1.78 లక్షల మంది మృతి

  • రోడ్డు పక్కన ట్రక్కులు నిలపడం ప్రమాదాలకు ప్రధాన కారణం: గడ్కరీ

న్యూఢిల్లీ, డిసెంబరు 12: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, అంతర్జాతీయ సదస్సుల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తే సమాధానం చెప్పలేక సిగ్గుతో ముఖాన్ని దాచుకోవాల్సి వస్తోందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్డు ప్రమాదాలపై ఆయన మాట్లాడారు. తాను రోడ్డు, రవాణా మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు రోడ్డు ప్రమాదాలను 50ు మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, కానీ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నప్పుడు దేశంలో రోడ్డు ప్రమాదాలపై చర్చ జరిగితే సిగ్గుతో ముఖం దాచుకోవాల్సి వస్తోందని వాపోయారు.


దేశంలో ప్రజలకు చట్టాలంటే భయం లేదని పేర్కొన్నారు. కొంత మంది రెడ్‌ సిగ్నల్‌ జంప్‌ చేస్తున్నారని, కొంత మంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్లు ధరించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజలు మారాలని, చట్టాలను గౌరవించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. రోడ్డు పక్కన ట్రక్కులను నిలిపి ఉంచడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఏటా 1.78 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, వారిలో 60ు మంది 18 నుంచి 34 ఏళ్ల వయసు వారేనని తెలిపారు. తాను, తన కుటుంబం కూడా ఓసారి రోడ్డు ప్రమాదానికి గురై చాలా రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని లోక్‌సభ సభ్యులను గడ్కరీ కోరారు.

Updated Date - Dec 13 , 2024 | 05:38 AM