Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..
ABN , Publish Date - Oct 09 , 2024 | 04:58 AM
జాతీయ రహదారిపై కార్లో వెళుతునప్పుడు సహజంగానే పిల్లలు ఆకలి అంటూ మారాం చేస్తుంటారు. వంటల్లో కల్తీ నూనె, నాసిరకమైన పదార్థాలు వాడతారనే భయంతో చిన్నారులపై పెద్దలు కన్నెర్ర చేస్తుంటారు.
హైవేల వెంట ఫుడ్‌కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలు
రిపేర్ షాపులు, ఏటీఎంలు మరెన్నో సౌకర్యాలు
అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం ‘హమ్ సఫర్’ పాలసీ
ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, అక్టోబరు 8: జాతీయ రహదారిపై కార్లో వెళుతునప్పుడు సహజంగానే పిల్లలు ఆకలి అంటూ మారాం చేస్తుంటారు. వంటల్లో కల్తీ నూనె, నాసిరకమైన పదార్థాలు వాడతారనే భయంతో చిన్నారులపై పెద్దలు కన్నెర్ర చేస్తుంటారు. అయితే.. ఈ భయాలేవీ లేకుండా పిల్లలతో కలిసి పెద్దలు కూడా ఆ రోడ్డు పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫుడ్‌కోర్టులో భేషుగ్గా తినొచ్చు! అలాగే దారిలో అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు.. ప్రమాదం సంభవించినప్పుడు కంగారుపడకుండా రోడ్డు పక్కనే ట్రామా సెంటరూ ఉంటుంది! ఈటరీలు, ట్రామా సెంటర్లే కాదు.. ఇబ్బందుల్లేని, సుఖవంతమైన ప్రయాణం కోసం ఫార్మసీలు, పెట్రోలు బంకులు, ఏటీఎంలు, రిపేర్ షాపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఇలా ఎన్నో వసతులను పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయరహదారులు, ఎక్స్‌ప్రెస్ వేల వెంబడి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.
ఈ మేరకు జాతీయ రహదారుల వెంబడి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఉద్దేశించిన ‘హమ్ సఫర్’ పాలసీని మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. హమ్‌సఫర్ సేవలు అందించేవాళ్లు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి పలు మినహాయింపులు ఉంటాయి. ప్రయాణికులు ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్ సాయంతో ఈ షాపుల లొకేషన్లను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా షాపుల్లో, బంకుల్లో సేవలు, నాణ్యతపై ఈ యాప్ ద్వారా రేటింగ్ కూడా ఇవ్వొచ్చు. వీటిని తరచూ తనిఖీలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. కాగా ఈ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా గడ్కరీ మాట్లాడారు.
రాన్నున్న రోజుల్లో రోడ్డు భద్రత, ప్రయాణ సౌకర్యాలకు ‘హమ్ సఫర్’ పర్యాయ పదంగా మారుతుందన్నారు. ఈ సౌకర్యాలన్నింటినీ పర్యావరణ హితమైన పద్ధతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. హమ్ సఫర్ పాలసీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు ఉద్యోగాల సృష్టి జరుతుందని గడ్కరీ చెప్పారు. ‘‘ఎవరైతే ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేస్తారో.. వాళ్లు ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పెట్రోలు బంకుల యజమానులు నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. హైవేలపై ఉన్న పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరని చెప్పారు. చాలా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లకు తాళం వేసి ఉండటం తాను గమనించానని తెలిపారు. అలా ఉంటే పెట్రోల్ బంకులను మూసేస్తామని హెచ్చరించారు.