Share News

NDA: ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న నితీష్.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు!

ABN , Publish Date - Jun 05 , 2024 | 07:25 AM

బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.

NDA: ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న నితీష్.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు!

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.

లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉండటం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ మిత్రపక్షాలు అవసరం కావడంతో, బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, టీడీపీకి అధినేత చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్‌లుగా మారారు. టీడీపీ భాగస్వామ్యంలోని ఎన్డీఏ కూటమి(టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3) కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారింది.


ఆద్యంతం ఆసక్తికరం..

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మేజిక్‌ మార్కు దాటిన బీజేపీ ఈసారి ‘టార్గెట్‌ 370’ అంటూ బరిలోకి దిగింది! ఎన్డీయే కూటమిగా 400కుపైగా సీట్లను సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ, తుది ఫలితాల్లో అత్తెసరు మెజారిటీతోనే ఎన్డీయే మేజిక్‌ మార్కును దాటింది. ఎన్డీయే మిత్రపక్షాల్లో టీడీపీ-జనసేన సాధించిన 18 స్థానాలు; జేడీయూకు వచ్చిన 12 సీట్లు కీలకంగా మారాయి. ఆయా పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. అదే సమయంలో, ఇండి కూటమికి కూడా మేజిక్‌ మార్కు చేరడానికి దాదాపు 40 సీట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే, రాజకీయ గండరగండడు శరద్‌ పవార్‌ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది.


ఆయన అటు నితీశ్‌ కుమార్‌తోనూ ఇటు చంద్రబాబుతోనూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఇండియా కూటమి నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్‌ చేసి ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయంపై అభినందించారు. ఎన్డీయే కన్వీనర్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టాలని చంద్రబాబును అమిత్‌ షా కోరినట్లు సమాచారం.

తాజా పరిణామాల నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి చంద్రబాబు సహా కూటమి నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం తర్వాత కూటమి భవిష్యత్తు, ప్రధాన మంత్రి ఎవరనే అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. మరోవైపు, ఇండి కూటమి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. బుధవారం దేశ రాజధానిలో విస్తృతంగా సమావేశాలు జరపనుంది.

Updated Date - Jun 05 , 2024 | 07:25 AM