Share News

North America : కెనడాలో ఇళ్ల సంక్షోభం

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:40 AM

విద్యార్థులు, వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతోపాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఒక ఇల్లు కొనేద్దాంలే! అనుకున్నా అవి కూడా అలానే ఉన్నాయి.

North America :  కెనడాలో ఇళ్ల సంక్షోభం

  • భారీగా పెరిగిన అద్దెలు.. కొందామన్నా.. అదేమోత

  • నగరాలకు దూరమవుతున్న వలసదారులు, విద్యార్థులు

  • కొందరు పొరుగు దేశాలకు.. మరోవైపు పెరిగిన నిరుద్యోగం

  • 29 నెలల గరిష్ఠసాయికి సూచీ

  • కెనడాలో 326% పెరిగిన ఇండియన్స్‌

న్యూఢిల్లీ, జూలై 6: విద్యార్థులు, వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతోపాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఒక ఇల్లు కొనేద్దాంలే! అనుకున్నా అవి కూడా అలానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు, వలసదారులు కెనడా శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరికొందరు ఈ అద్దెల ధరలు భరించలేక దేశాన్నే విడిచిపెట్టేస్తున్నారు. ఎక్కువ మంది అల్‌బెర్టా ప్రావిన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మరికొందరు అమెరికాకు వలస పోతున్నారు. ఇళ్ల ధరలను భరించలేక కెనడాను వదిలేస్తున్న వారి సంఖ్య 28ుగా ఉందని ఆంగస్‌ రీడ్‌ ఇనిస్టిట్యూట్‌(ఏఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది. ఇటీవల కెనడాకు వచ్చిన 39ు మంది సహా 42ు మంది కెనడాకు చెందిన వారు కూడా అద్దెల ధరలు భరించలేక శివారు ప్రాంతాలకు తరలి పోతున్నట్టు నివేదిక వివరించింది.

ఫలితంగా కెనడా ఇమేజ్‌ ప్రభావితమవుతోందని పేర్కొంది. ప్రధానంగా ఖరీదైన నగరాలుగా పేరున్న వాటిలో ఇళ్ల ధరలు, అద్దెలు కూడా నింగినంటాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి ఇళ్ల అద్దెల ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరింది. దీంతో ఇళ్ల అద్దెలు మండిపోతున్నాయని స్థానికులు తెలిపారు. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలస దారులు ఇక్కడ నివసించేందుకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


నివేదికలోని కీలక అంశాలు ఇవీ..

  • ప్రస్తుతం ఉన్న ఇళ్ల అద్దెలు పెరగడంతో వాటిని ఖాళీ చేయాలని 28ు మంది నిర్ణయించుకున్నారు.

  • గత పదేళ్లుగా కెనడాలోనే ఉంటున్నవారిలో 39 శాతం మంది వలసదారులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

  • ప్రతి 10 మంది కెనడా వాసుల్లో ముగ్గురు ఇళ్ల ధరలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • పట్టణ ప్రాంతాలైన గ్రేటర్‌ టొరంటో ఏరియా, మెట్రో వాంకోవర్‌ నగరాల్లోని చాలా మంది ప్రజలు ఇక్కడి ఇళ్ల అద్దెలు భరించలేక అల్‌బెర్టా వంటి సౌకర్యవంతమైన ప్రావిన్స్‌కు తరలిపోయేందుకు సిద్ధమవుతున్నారు.

  • టొరంటోలోని 44 శాతం మంది నివాసితులు నగరాన్ని వదిలి పెట్టేయాలని నిర్ణయించారు. మరో 22 శాతం మంది కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు.

  • వాంకోవర్‌ నగరంలో నివసిస్తున్న వారిలో 33 శాతం మంది నివాసితులు కూడా ఇళ్ల అద్దెల ధరలు పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ఇతర నగరాల కంటే కూడా.. అల్‌బెర్టా, అట్లాంటిక్‌ కెనడాల్లో పరిస్థితి అనుకూలంగా ఉందని కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు.

  • 42 శాతం మంది ప్రజలు పొరుగు దేశాల్లో కొత్త ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కువ మంది అమెరికా సహా ఇతర దేశాలవైపు చూస్తున్నారు.

  • కెనడా దేశీయులు కూడా ఇళ్ల అద్దెలు, లీజుల ధరలు పెరిగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో 12ు మంది ఇతర దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

  • కెనడాకు వలసదారులు పెరిగిపోయిన కారణంగా ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని 44.5 శాతం మంది కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు.

  • భారత దేశం నుంచి కెనడాకు వెళ్లిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఒక సంఘంగా ఏర్పడ్డారు. అయితే.. ఏటా వీరి సంఖ్య పెరిగిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

  • కెనడాలో 2013 నాటికి 32,828 మంది ఉన్న భారతీయుల సంఖ్య పదేళ్లలో 2023 నాటికి 1,39,715కి చేరింది. అంటే.. 326 శాతం పెరిగింది.

  • కెనడా అధికారిక లెక్కల ప్రకారం 62,410 మంది అంతర్జాతీయ విద్యార్థులు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.


  • 29 నెలల గరిష్ఠానికి నిరుద్యోగం

కెనడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఉద్యోగ కల్పన ఒడిదుడుకుల్లో పడింది. గత నెల జూన్‌లో 1400 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇదేసమయంలో నిరుద్యోగ సూచి 29 నెలల గరిష్ఠాన్ని(6.4%) నమోదు చేసింది. వాస్తవానికి మే నెలలోనే మార్కెట్‌ నిపుణులు నిరుద్యోగం 6.3 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, వారి అంచనాలు దాటి మరీ నిరుద్యోగం నమోదైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉద్యోగ కల్పన కష్టసాధ్యంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో నిరుద్యోగ రేటు 0.9 శాతం నుంచి 13.5 శాతానికి చేరిందని తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు.. నియామకాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ ఏడాది మేలో గంటల ప్రాతిపదికన ఉద్యోగుల వేతనాన్ని 5.2%నుంచి 5.6 శాతానికి పెంచారు. ఈ వేతనాల పెంపు నియామకాలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు.

Updated Date - Jul 07 , 2024 | 04:41 AM