Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం..ఆ సీటు ఖాళీ
ABN , Publish Date - Oct 21 , 2024 | 07:18 PM
గందేర్‌బల్ నియోజకవర్గం అబ్దుల్లా కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా 1977లోనూ, ప్రస్తుత అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా 1983, 1987, 1996లోనూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రెండు సీట్లలో బుద్గాం (Budgam) సీటును వదలుకున్నారు. గందేర్‌బల్ (Ganderbal) నియోజకవర్గాన్ని నిలుపుకున్నారు. ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ ఈ విషయాన్ని అసెంబ్లీలో సోమవారంనాడు ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఒకే అభ్యర్థి రెండు సీట్లలో పోటీచేసి, రెండూ గెలిస్తే ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం బుద్గాం సీటును సీఎం వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది.
Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం
అబ్దుల్లా కుటుంబం కంచుకోట
గందేర్‌బల్ నియోజకవర్గం అబ్దుల్లా కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా 1977లోనూ, ప్రస్తుత అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా 1983, 1987, 1996లోనూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఒమర్ అబ్దుల్లా 2008 నుంచి 2014 వరకూ జమ్మూకశ్మీర్‌కు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2002లో జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్‌బల్ నుంచే ఒమర్ పోటీ చేసి పీడీపీ అభ్యర్థి క్వాజి మహమ్మద్ అఫ్జల్ చేతిలో 2,870 ఓట్ల తేడాతో ఒడిపోయారు.
రెండు చోట్లా ఆధిక్యత
ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్‌బల్ నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేసి పీడీపీ అభ్యర్థి బషీర్ అహ్మద్ మీర్‌పై 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బుద్గాంలోనూ పీడీపీ అభ్యర్థి ఆగా సైయద్ ముంతజిర్ మెహ్దిపై 18,485 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాగా, ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి 95 మంది అసెంబ్లీ సభ్యుల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు కేవలం 41 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని కూడగట్టింది. ఎన్‌సీ ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి ఒక ఎమ్మెల్యే, సీపీఎం నుంచి ఒక ఎమ్మెల్యే మద్దతిస్తున్నారు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..