Doda Encounter: దోడాలో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో టెర్రరిస్టు హతం
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:52 PM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా దోడా జిల్లా బజాద్ గ్రామంలోని గండోహ్ ప్రాంతంలో బుధవారంనాడు ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా దోడా (Doda) జిల్లా బజాద్ గ్రామంలోని గండోహ్ ప్రాంతంలో బుధవారంనాడు ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా కోసం ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు.
ఈనెల 11, 12 తేదీల్లో ఇక్కడి కొండ ప్రాంతంలో జంట ఉగ్రదాడులు చోటుచేసుకోవడంతో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. చాత్తర్‌గల్లాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై జూన్ 11న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, ఆ మరుసటి రోజు కోటా టాప్‌లోని గందోహ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు గాయపడ్డారు. నలుగురు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ ఉగ్ర ఆపరేషన్ జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కొక్కరి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును కూడా ప్రకటించారు. సినో పంచాయత్‌లో భద్రతా బలగాల సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు జరుపుతుండగా, అక్కడ తలదాచుకున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు.
చైనా గ్రనేడ్ స్వాదీనం..
కాగా, రాజౌరి జిల్లా పిండ్ గ్రామంలోని చింగుస్ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక చైనా హ్యాండ్ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల గస్తీ బృందానికి మంగళవారం సాయంత్రం ఈ గ్రనేడ్ కనిపించినట్టు అధికారులు తెలిపారు.