Board Exams: 10, 12వ తరగతుల్లో 65 లక్షల మంది ఫెయిల్
ABN , Publish Date - Aug 22 , 2024 | 05:52 AM
గతేడాది దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 65లక్షల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
రాష్ట్ర బోర్డుల్లోనే ఫెయిల్యూర్ రేటు అధికం: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: గతేడాది దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 65లక్షల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కేంద్ర బోర్డుతో పోలిస్తే రాష్ట్ర బోర్డుల్లో పెయిల్యూర్ రేటు ఎక్కువగా ఉందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 56 రాష్ట్ర బోర్డులు, మూడు జాతీయ బోర్డులతో కలిపి మొత్తం 59 బోర్డుల ఫలితాలను విశ్లేషించగా.. ‘పదో తరగతి విద్యార్థుల్లో 28లక్షల మంది ఫెయిలయ్యారు.
మరో 5.5 లక్షల మంది అసలు పరీక్షలకు హాజరు కాలేదు. మొత్తంగా 33.5 లక్షల మంది తర్వాత గ్రేడ్‌కు చేరలేదు’ అని శాఖ అధికారి ఒకరు వివరించారు. అదేవిధంగా 12వ తరగతి విద్యార్థులు 32.4 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేదు. వీరిలో 27.2లక్షల మంది ఫెయిల్ కాగా, మరో 5.2లక్షల మంది పరీక్షలకు హాజరు కాలేదు. పదో తరగతిలో విద్యార్థుల ఫెయిల్యూర్ రేటు కేంద్ర బోర్డులో 6ు ఉండగా, రాష్ట్ర బోర్డుల్లో 16 శాతంగా ఉంది. అలాగే 12వ తరగతిలో కేంద్ర బోర్డులో విద్యార్థుల ఫెయిల్యూర్ రేటు 12ు కాగా, రాష్ట్ర బోర్డుల్లో 18శాతంగా నమోదైంది.