Share News

Siddharamaiah: పాక్ అనుకూల నినాదాలు నిజమని తేలితే కఠిన చర్యలు: సీఎం

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:01 PM

కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ ఆరోపణలు నిజమని తేలితే ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Siddharamaiah: పాక్ అనుకూల నినాదాలు నిజమని తేలితే కఠిన చర్యలు: సీఎం

బెంగళూరు: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల (Rajya sabha) ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. బీజేపీ ఆరోపణలు నిజమని తేలితే ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందని, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వాస్తవమని అందులో తేలితే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. బెంగళూరు సిటీ పోలీసులు మంగళవారం రాత్రి సుమోటో కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.


కాగా, విధానసౌధలో కాంగ్రెస్ మద్దతుదారులు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేశారని ఆరోపిస్తూ కర్ణాటక అసెంబ్లీ వెలుపల బీజేపీ మద్దతుదారులు నిరసనకు దిగారు. పాక్ అనూకూల నినాదాల ఘటనపై విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో కూడా బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ, టీవీ ఛానెల్స్ నుంచి వీడియో ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారని, తదుపరి విచారణ కోసం దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు.


నాకు తెలియదు..

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుసేన్ విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించగానే విధానసౌధలో నాసిర్ వెనుకనే ఉన్న ఓ వ్యక్తి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినట్టు బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను హుసేన్ ఖండించారు. తన అనుచరులు ''నాసిర్ సాబ్ జిందాబాద్'' అనే నినాదాలు మాత్రమే చేశారని చెప్పారు. ''పాక్ అనుకూల నినాదాల విషయంపై నేను ఇంటికి వెళ్తుండగా ఒక మీడియా సంస్థ నాకు ఫోన్ చేసి అడిగింది. జనం మధ్యలో నేను ఉన్నాను. అలాంటి నినాదాలు ఏవీ నేను వినలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తారు'' అని హుసేన్ తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 05:01 PM