NEET Paper Leak Case: రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన మోదీ పేపర్ లీకేజీని ఆపలేకపోయారన్న రాహుల్
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:20 PM
నీట్ పరీక్షల్లో అవకతవకలపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ వివాదంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కేంద్రప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
నీట్ పరీక్షల్లో అవకతవకలపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ వివాదంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కేంద్రప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలను ఆపడం ప్రధాని మోదీకి ఇష్టం లేనట్లు కనిపిస్తోందన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారని చెప్పుకుంటారని.. దేశంలో పేపర్ లీకేజీలను మాత్రం ఆయన ఆపలేకపోతున్నారని రాహుల్ విమర్శించారు. విద్యావ్యవస్థలో బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్ఎస్ చొరబడిన కారణంగానే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యావ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనం పోయినప్పుడే పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ప్రధాని మోదీ.. పేపర్ లీకేజీలతో విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో అర్హత లేని వీసీలను బీజేపీ మాతృసంస్థ సిఫార్సులతో నియమించిన కారణంగానే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు.
రేపు దేశవ్యాప్తంగా నిరసనలు..
నీట్ పేపర్ లీకేజీ వ్యవహరంపై శుక్రవారం దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసనలు నిర్వహించాలని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ శాఖలను ఆదేశించింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News