Mallikarjun Kharge: కాంగ్రెస్‌కు ఓటేయకుంటే.. అంత్యక్రియలకు రండి!
ABN , Publish Date - Apr 25 , 2024 | 05:33 AM
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే.. కనీసం తన అంత్యక్రియలకు హాజరుకావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లను కోరారు.
స్వస్థలం కలబురగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం
కలబురగి, తిరువనంతపురం, ఏప్రిల్ 24:ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే.. కనీసం తన అంత్యక్రియలకు హాజరుకావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లను కోరారు. కర్ణాటకలోని తన స్వస్థలం కలబురగిలో బుధవారం ఎన్నికల బహిరంగసభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఈ నియోజకవర్గంలోని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే, తనకు ఇక ఇక్కడ స్థానం లేదని భావిస్తానని చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన అల్లుడు దొడ్డమాని రాధాకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోందంటే.. ఇద్దరు అమ్మకందార్లు, ఇద్దరు కొనుగోలుదార్లు ఉన్నారు. అమ్మకందార్లు మోదీ, అమిత్‌షా, కొనుగోలుదార్లు అంబానీ, అదానీ.
మాజీ ప్రధాని నెహ్రూ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు మోదీ, అమిత్‌షా అమ్మేస్తున్నారు’ అని ఖర్గే మండిపడ్డారు. అలాగే, కేరళ రాజధాని తిరువనంతపురంలో ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఓటర్ల మద్దతు లభిస్తుండటంతో మోదీ నిరాశ చెందుతున్నారని, అందుకే ఓటర్లలో మతపరమైన చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ప్రతిదానికీ మతంతో లింకుపెట్టి దేశాన్ని నాశనం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, చిల్లర రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారన్నారు.