PM Modi: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
ABN , Publish Date - Oct 30 , 2024 | 08:32 AM
డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత హాస్పిటల్ సంరక్షణ సౌకర్యాన్ని అందించే ‘ఆయుష్మాన్ భారత్’ స్కీమ్‌ను అమలు చేయని పశ్చిమ బెంగాల్, ఢిల్లీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ పథకాన్ని అమలు చేయలేకపోతున్నందున క్షమించాలని పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులను ఆయన కోరారు.
డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత హాస్పిటల్ సంరక్షణ సౌకర్యాన్ని అందించే ‘ఆయుష్మాన్ భారత్’ స్కీమ్‌ను అమలు చేయని పశ్చిమ బెంగాల్, ఢిల్లీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ పథకాన్ని అమలు చేయలేకపోతున్నందున క్షమించాలని పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులను ఆయన కోరారు. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏడాదికి రూ.5 లక్షల వరకు హెల్త్ కవర్ ఉంటుందని ఆయన ప్రస్తావించారు. పలు హెల్త్ సంబంధిత ప్రాజెక్టులను ప్రారంభం సందర్భంగా మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతితో పాటు ధనిక కుటుంబాలకు చెందిన వృద్ధులు కూడా ప్రయోజనం పొందవచ్చని అన్నారు.
పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న వృద్ధులకు ‘ఆయుష్మాన్ వయ వందన కార్డు’ వస్తుందని, తద్వారా ప్రభుత్వ లేదా సూచించిన ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత చికిత్సకు అర్హులు అవుతారని వివరించారు. వృద్ధుల ఆరోగ్యంపై కుటుంబాల ఖర్చును తగ్గించేందుకు ఈ పథకం దోహదపడుతుందని మోదీ గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలో చేరకపోవడంతో బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులు ఈ ప్రయోజనాలను పొందలేరని అన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను అణచివేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను మోదీ విమర్శించారు.
కాగా మోదీ వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో అధికారంలో ఆప్ పార్టీలు కౌంటర్లు ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వాస్థ్య సతి పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి ఆయుష్మాన్ భారత్‌గా అమలు చేస్తోందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాని కంటే రెండు సంవత్సరాల ముందే స్వాస్థ్య సతి పథకం ప్రారంభమైందని అన్నారు. 100 శాతం పేపర్‌లెస్, క్యాష్‌లెస్ అని డెరెక్ అన్నారు. తమ పథకంలో వ్యాధులన్నీ కవర్ అవుతాయని, కుటుంబంలో ఇంతమందికే అనే పరిమితి ఉండదని పేర్కొన్నారు.
ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా మోదీకి కౌంటర్ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం సాధారణ ప్రజలకు అందించలేని విధంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయని అన్నారు. “ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలకు అర్హులు కాదు. బైక్ ఉన్నా లేదా నెలవారీ ఆదాయం రూ.10,000 కంటే ఎక్కువగా ఉన్న ఈ పథకం నుంచి మినహాయిస్తారు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసినా ఈ నిర్బంధ నిబంధనల కారణంగా ఒక్క ఢిల్లీ నివాసి కూడా ప్రయోజనం పొందలేడు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
న్యూక్లియర్ డ్రిల్ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది
ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్
పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే
ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
For more Business News and Telugu News