Share News

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు!

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:31 AM

ఉగ్రవాదం అనే సవాలును ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరికి తావు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం పటిష్ఠ మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు!

  • అందరం ఏకతాటిపై నిలిచి ఎదుర్కోవాలి.. చర్చలు, దౌత్య మార్గాలకే భారత్‌ మద్దతు.. యుద్ధానికి కాదు

  • బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ.. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి.. బ్రిక్స్‌ దేశాధినేతల తీర్మానం

  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు.. సరిహద్దు గస్తీ ఒప్పందాన్ని స్వాగతించిన నేతలు

  • వివాదాలను సరైన పద్ధతిలో పరిష్కరించుకోవాలి.. భారత్‌-చైనా బంధం ప్రపంచానికే కీలకమన్న మోదీ

కజాన్‌, అక్టోబరు 23: ఉగ్రవాదం అనే సవాలును ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరికి తావు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం పటిష్ఠ మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. భారత్‌ ఎప్పుడూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికే మద్దతు తెలుపుతుందని.. యుద్ధానికి కాదని చెప్పారు. శాంతి చర్చల ద్వారానే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు. కొవిడ్‌ లాంటి సవాళ్లను సమష్టిగా ఎదుర్కొన్న తరహాలోనే మనమంతా కలిసి భావి తరాలకు భద్రతమైన, పటిష్ఠమైన భవిష్యత్తును అందించేందుకు సరికొత్త అవకాశాలను సృష్టించాలని మోదీ సూచించారు. రష్యాలోని కజాన్‌ నగరంలో జరుగుతున్న 16వ బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు.


రష్యా, చైనా, ఇరాన్‌ అధినేతలు పుతిన్‌, జిన్‌పింగ్‌, మసౌద్‌ పెజెష్కియన్‌ల సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. బ్రిక్స్‌ దేశాల్లో యువతను ఉగ్రవాదంవైపు పురికొల్పడాన్ని అడ్డుకోవడానికి క్రియాశీల చర్య లు చేపట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకు ఆర్థి క సాయాన్ని అడ్డుకోవడంలో అందరూ కలిసి పనిచేయాలని, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని తేల్చిచెప్పారు. ‘పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు’ అని పేర్కొనాలంటూ ఐరాసలో చేసిన అనే క ప్రతిపాదనలను చైనా అడ్డుకున్న నేపథ్యంలో మోదీ ‘ద్వంద్వ ప్రమాణాలు’ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


అంతర్జాతీయ ఉగ్రవాద సమస్యపై ఐరాసలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కలిసి పనిచేయాలని మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, యుద్ధాలు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్‌ కీలక పాత్ర పోషించాలన్నారు. ఇక బ్రిక్స్‌లోకి కొత్త దేశాలను చేర్చుకోవడాన్ని భారత్‌ స్వాగతిస్తోందని చెప్పారు. గాజాస్ట్రి్‌పలో తక్షణమే, శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని, ఇరువైపుల నుంచి బంధీలను విడిచిపెట్టాలని బ్రిక్స్‌ నేతలు తీర్మానం చేశారు. అలాగే సహాయ కార్యకలాపాలు చేపడుతున్న సంస్థలపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని బ్రిక్స్‌ సభ్యులు ఖండించారు.


  • సరిహద్దు గస్తీ ఒప్పందాన్ని స్వాగతించిన జిన్‌పింగ్‌, మోదీ

బ్రిక్స్‌ సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బుధవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇద్దరు నేతలూ భేటీ కావడం ఇదే తొ లిసారి. భారత్‌-చైనాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించి కుదిరిన ఒప్పందాన్ని ఇరువురు నేతలూ స్వాగతించారు. విభేదాలు, వివాదాలను సరైన పద్ధతిలో పరిష్కరించుకోవడం ప్రధానమని.. వీటి ప్రభా వం శాంతి, సామరస్యాలపై పడకూడదని భేటీలో మోదీ.. జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. భారత్‌-చైనా సంబంధాలు కేవలం ఇరుదేశాల ప్రజలకే కాదని, ఈ ప్రాంతంతోపాటు అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు కూడా ప్రధానమని వ్యాఖ్యానించారు.


పరస్పర గౌరవం, పరిణతితోనే భారత్‌, చైనాల మధ్య శాంతియుత, సుస్థిర బంధాలు ఉంటాయని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. విభేదాల పరిష్కారంలో ఇరుదేశాల ప్రతినిధులు మరింత సమర్థంగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌ చెప్పారు. ఇది ఇరుదేశాలకు అత్యంత ప్రాధాన్య అంశమన్నారు. ఇక సరిహద్దు అంశంపై ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల తదుపరి సమావేశం అతిత్వరలోనే ఉంటుందని మోదీ, జిన్‌పింగ్‌ పేర్కొన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాతో చెప్పారు. కాగా, బుధవారం ఉజ్బెకిస్థాన్‌, యూఏఈ అధ్యక్షులతో కూడా మోదీ భేటీ అయ్యారు. ఆయా దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.


  • బ్రిక్స్‌ తెర వెనుక తెలుగు అధికారి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): భారత- చైనా సంబంధాల్లో నూతన అధ్యాయానికి తెర లేపిన చరిత్రాత్మక బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం వెనుక కీలక పాత్ర పోషించింది మన తెలుగోడే! ఈ సమావేశానికి రూపకల్పన చేసింది, బుధవారం పది దేశాలు ఆమోదించిన తీర్మానాన్ని రూపొందించింది.. భారత విదేశాంగ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అధికారి దమ్ము రవి. విదేశాంగ శాఖలో ఆర్థిక సంబంధాల కార్యదర్శిగా ఉన్న ఆయన.. ఈ సమావేశాలకు ప్రధాన సంధానకర్త (షెర్పా)గా వ్యవహరించారు. కాగా ఈ సదస్సులో ఒకరి కరెన్సీని మరొకరు గుర్తించడం, వాతావరణ మార్పు, ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక సంబంధాలు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు మొదలైన వాటిపై చర్చలు జరిగాయని దమ్ము రవి విలేకరులకు తెలిపారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఆయన.. 1989లో భారత విదేశాంగ సర్వీసులో చేరారు.

Updated Date - Oct 24 , 2024 | 04:31 AM