Share News

అర్బన్‌ నక్సల్స్‌ గుప్పిట కాంగ్రెస్‌

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:05 AM

అర్బన్‌ నక్సల్స్‌ గుప్పిట్లో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదని, వారిని బుజ్జగించడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.

అర్బన్‌ నక్సల్స్‌ గుప్పిట కాంగ్రెస్‌

  • వారిని బుజ్జగించడానికి ఏమైనా చేస్తుంది

  • జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల సభల్లో మోదీ

జమ్మూ, సెప్టెంబరు 28 : అర్బన్‌ నక్సల్స్‌ గుప్పిట్లో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదని, వారిని బుజ్జగించడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కశ్మీర్‌లో జవాన్ల త్యాగాల గురించి కాంగ్రె్‌సకు తెలియదని దుయ్యబట్టారు. ‘‘ఇది కొత్త భారతం. ఇంట్లోకి చొరబడి మరీ హతమారుస్తుంది’’ అంటూ 2016లో సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబరు 28) పాకిస్థాన్‌పై జరిగిన మిలిటరీ సర్జికల్‌ స్ర్టైక్స్‌ను ఆయన గుర్తుచేశారు. జమ్మూకశ్మీరుకు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం అనేది కొద్ది కాలానికి మాత్రమే తీసుకున్న నిర్ణయమని మోదీ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో శనివారం ప్రధాని మోదీ పర్యటించారు. జమ్మూ నడిబొడ్డున ఉన్న ఎమ్‌ఏఎమ్‌ స్టేడియంలో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌- ఎన్‌సీ కూటమి, పీడీపీ పార్టీలపై విరుచుకుపడ్డారు.


కశ్మీర్‌ ప్రజలకు ఆ మూడు పార్టీలు అన్యాయం చేశాయన్నారు. అవి తమ కుటుంబాలకు మేలు చేసుకున్నాయేగానీ, అంతులేని బాధల్లో ఉన్న కశ్మీరీలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. లోపాయికారీ కాంగ్రెస్‌ రాజకీయాలు, నిర్లక్ష్యమే కశ్మీరీలకు శాపాలుగా మారాయన్నారు. ‘‘పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన మిలిటరీ సర్జికల్‌ స్ర్టైక్స్‌ విశ్వసనీయతను ప్రశ్నించే కాంగ్రెస్‌ ద్రోహాన్ని మరవగలమా? ఓటుబ్యాంకు కోసం విదేశీ చొరబాటుదారులకు కాంగ్రెస్‌ స్వాగతం పలుకుతోంది. సొంత ప్రజలను మాత్రం అవమానిస్తోంది’’ అని దుయ్యబట్టారు.

జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని మోదీ అన్నారు. బీజేపీకి మాత్రమే ఆ శక్తి ఉన్నదని స్పష్టం చేశారు. ‘‘తమను గెలిపిస్తే పాత వ్యవస్థను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్-ఎన్‌సీ, పీడీపీ చెబుతున్నాయి. బీజేపీకి అధికారం కట్టబెడితే మహిళా సాధికారికత కోసం పాటుపడతామని వివరించారు. ‘‘స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటుచేసి అక్కచెల్లెమ్మలను ధనవంతులను చేస్తాం. తగిన శిక్షణ ఇప్పించి డ్రోన్లను వారికి ఇప్పిస్తాం’’ అని తెలిపారు.

Updated Date - Sep 29 , 2024 | 04:05 AM