PM Modi : దేశంలో అస్థిరతకు యత్నాలు!
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:29 AM
భారత్ నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుండడం.. ఐకమత్య భావన పెరుగుతుండడం దేశ శత్రువులకు కంటగింపుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు.
బాహ్య, అంతర్గత శక్తుల ఎత్తులు.. సరిహద్దులపై రాజీ ప్రసక్తే లేదు
అంగుళం భూమి కూడా వదులుకోం: ప్రధాని
సర్ క్రీక్ వద్ద జవాన్లతో దీపావళి వేడుకలు
భుజ్, నవంబరు 1: భారత్ నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుండడం.. ఐకమత్య భావన పెరుగుతుండడం దేశ శత్రువులకు కంటగింపుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే దేశంలో అస్థిరత, అరాచకం సృష్టించేందుకు బాహ్య, అంతర్గత శత్రువులు పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. ఖలిస్థానీ ఉగ్రవాదుల విషయంలో కెనడా-భారత్ దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి నాడు ఆయన జవాన్లతో గడిపారు. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ జిల్లాలోని సర్ క్రీక్ లైన్ వద్ద త్రివిధ దళాలు, బీఎ్‌సఎఫ్ సిబ్బందితో సంభాషించారు. అలాగే సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నర్మద జిల్లాలో ఏకతా విగ్రహం వద్ద నివాళులు అర్పించి.. అక్కడకు వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశ సరిహద్దులపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదన్నారు. ‘సర్ క్రీక్ ప్రాంతాన్ని యుద్ధరంగంగా మలిచేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. మన శత్రువు ఎంతో కాలంగా దీనిపై కన్నేసింది. దౌత్యం పేరిట కబళించాలని చూసింది. కానీ నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నేను ఆ కుయుక్తులపై గళమెత్తాను. మీరంతా (సైనికులు) రక్షణ కవచంలా నిలిచినందున మాకెలాంటి ఆందోళనా లేదు. ఇది మన శత్రువుకు కూడా తెలుసు’ అని మోదీ పేర్కొన్నారు. అయితే దేశం లోపల, వెలుపల కొన్ని శక్తులు, వికృత మనస్తత్వాలు కలిగినవారు.. వక్రీకరించిన ఆలోచనలతో ఉన్నవారు.. అరాచకం, అస్థిరతల సృష్టికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అర్బన్ నక్సల్స్ దేశాన్ని చీల్చాలని చూస్తున్నారని.. వారితో ఎవరెవరికి బంధం ఉందో గుర్తించాలని ప్రజలకు పిలుపిచ్చారు. ఇక కచ్ ప్రాంతంలో పర్యాటక రంగానికి అధిక అవకాశాలు ఉన్నాయన్నారు.