PM Modi: ఎంపీ సుమలత ఢిల్లీ వెళ్లారు.. ప్రధాని మోదీని కలిశారు.. ఇక సీటు పక్కా..?
ABN , Publish Date - Feb 10 , 2024 | 01:21 PM
రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తుకుదరడం, మండ్య లోక్‌సభ టిక్కెట్‌ను జేడీఎస్ కోరుతున్న నేపథ్యంలో.. ఎంపీ సుమలత(MP Sumalatha) ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)ని కలిశారు.
- ప్రధానితో ఎంపీ సుమలత భేటీ..
బెంగళూరు: రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తుకుదరడం, మండ్య లోక్‌సభ టిక్కెట్‌ను జేడీఎస్ కోరుతున్న నేపథ్యంలో.. ఎంపీ సుమలత(MP Sumalatha) ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)ని కలిశారు. రెండురోజులుగా రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు వచ్చే ఎన్నికలలో టిక్కెట్ సాధించుకునే దిశగా ఎంపీ సుమలత హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. మండ్య లోక్‌సభ స్థానాన్ని జేడీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే స్థానం నుంచి జేడీఎస్(JDS) అభ్యర్థిగా నిఖిల్‌కుమార్ లేదా మాజీమంత్రి తమ్మణ్ణలో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో సుమలత ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ సంఘటనా కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను ఆమె వేర్వేరుగా కలిశారు. సుమలత తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీ షెడ్యూల్లోనూ కలిసే అవకాశఽం ఇచ్చారని, రానున్న కాలంలోను రాష్ట్రం, దేశసేవలో మీతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకున్నారు. ప్రస్తుతం మండ్య ఇండిపెండెంట్ ఎంపీగా సుమలత వ్యవహరిస్తున్నారు. గడిచిన శాసనసభ ఎన్నికల వేళ బహిరంగంగా బీజేపీకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంయుక్త అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను ఓడించి ఆమె ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో ఆమెపై బీజేపీ అభ్యర్థిని పోటీకి నిలపలేదు.